రాజమండ్రి ఎయిర్ పోర్టుకు మహర్ధశ పట్టనుంది. ఎయిర్‌కార్గో ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ లభించడంతో గోదావరి జిల్లా వాసుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. దేశ, విదేశాల నుంచి ఎగుమతి, దిగుమతులకు ఊరట లభించనుంది. 


ఉభయగోదావరి జిల్లాల వాసులు ఏళ్ల తరబడి వేచి చూస్తున్న చిరకాల స్వప్నం నెరవేరనుంది. కొన్నేళ్లుగా రాజమండ్రి ఎయిర్‌పోర్టు నుంచి కార్గో రవాణాకు అనుమతి తీసుకురావాలని తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు త్వరలో కార్గో రవాణా అందుబాటులోకి వచ్చే సమయం ఆసన్నమైంది. ఇందుకు కేంద్ర విమానయాన సంస్థ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. కేంద్రం నుండి ముగ్గురు సభ్యుల ప్రతినిధి బృందం ఎయిర్‌ పోర్టు పరిసరాలను చూశారు. బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌కు ప్రతినిధి బృందం నివేదిక ఇచ్చిన తరువాత ఎయిర్‌ కార్గో సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. కోనసీమలో కొబ్బరి, గోదావరి  జిల్లాలు అంతటా ఆక్వా, కడియంలో పువ్వుల ఉత్పత్తి ఎక్కువగా ఉన్నా ఇతర దేశాలకు ఎగుమతి చేసే సదుపాయం లేకపోవడంతో ఇన్నాళ్లూ వేరే మార్గాల్లో ప్రయత్నించి నష్టాల పాలవుతూ వస్తున్నారు. తాజాగా ఎయిర్‌ కార్గో కల నెరవేరనుండడంతో ఇక్కడి రైతులు, వ్యాపారుల ఆశలు చిగురిస్తున్నాయి.


ఉభయగోదావరి జిల్లాల నుంచి విదేశాలకు లక్షల విలువైన సహజ వనరులు ఎగుమతి అవుతున్నాయి. జిల్లా నుంచి రోజుకు సుమారు 350 టన్నుల ఆక్వా ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ ఆక్వా ఉత్పత్తులను ఎగుమతి చేయాలంటే విశాఖపట్నం ఎయిర్‌ పోర్టు లేదా కాకినాడ పోర్టు ద్వారా మాత్రమే జరుగుతున్నాయి. అయితే.. ఆక్వా ఉత్పత్తులు సకాలంలో చేర్చలేకపోతున్నామనే ఆవేదన వ్యాపారులు, రైతుల్లో చాలా కాలంగా ఉంది. ఇటు కోనసీమ నుంచి ఏటా సుమారుగా 12వందల కోట్ల విలువైన కొబ్బరి ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. ఎయిర్‌ కార్గో వ్యవస్థ అందుబాటులోకి వస్తే..  కొబ్బరి ఉత్పత్తులు జెట్‌ స్పీడ్‌తో విదేశాలకు ఎగుమతిచేసే అవకాశం లభిస్తుంది.


బెంగళూరు, కోల్‌కతాల నుంచి నిత్యం బస్సుల్లో పలు రకాల డెకరేషన్‌ పువ్వులు దిగుమతి చేసుకుంటున్నారు. ఒక రోజు రాత్రి ఆ రాష్ట్రంలో సరుకు వేస్తే తరువాత రోజు ఉదయం జిల్లాకు వస్తున్నాయి. అదే ఎయిర్‌ కార్గో అందుబాటులోకి వస్తే.. చెన్నై, కోల్‌కతా, బెంగళూరుల నుంచి గంటల వ్యవధిలోనే జిల్లాకు దిగుమతి అయ్యేందుకు మార్గం సుగమమవుతుందని నర్సరీ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి రెండు ఎయిర్‌ కార్గోలు వస్తాయని ఎయిర్‌ పోర్టు వర్గాలు చెబుతున్నాయి. ఒక్కో కార్గో విమానంలో సరుకులతో పాటు నిత్యం 180 మంది అదనంగా ప్రయాణించడానికి వీలు కలుగుతుంది. ఎయిర్ కార్గో సర్వీసుల రాకతో  ప్రయాణికుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: