టెలీకాం కంపెనీల షాకుల పరంపరలో మరో సంస్థ చేరింది. మొబైల్ సేవల ధరలను పెంచుతున్నట్లు రిలయన్స్ జియో ప్రకటించిన మరుసటి రోజే...ప్రభుత్వరంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ కూడా చార్జీలు పెంచడానికి సిద్ధమవుతోంది. వచ్చే నెల 1 నుంచి అమలులోకి వచ్చేలా ధరల పెంపుపై సమీక్ష జరుపుతున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. వొడాఫోన్-ఐడియా, భారతీ ఎయిర్‌టెల్ చార్జీల పెంపును ప్రకటించిన నేపథ్యంలో జియో కూడా పెంపు నిర్ణయానికి రావడం..ఆ వెంటనే బీఎస్ఎన్ఎల్ ప్రకటించడం గమనార్హం.
కాల్, డాటా చార్జీలు ఎంతమేర పెంచడం ఖరారు అయిందని, అయితే ఏ మేరకు పెంచనున్నారనే దానిపై బీఎస్ఎన్ఎల్ వర్గాలు స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. సెప్టెంబర్‌లో బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్ పరిధిలోకి 7.37 లక్షల మంది జతయ్యారు. దీంతో మొత్తం వినియోగదారుల సంఖ్య 11.69 కోట్లకు చేరుకున్నారు. ఫోన్ కాల్స్, డేటా చార్జీల పెంపుతో ఈ వినియోగదారులపై సహజంగానే భారం పడనుంది.
ఇదిలాఉండగా, ఉచిత వాయిస్ కాల్స్, ఇంటర్నెట్ సౌకర్యంతో దేశీయ టెలికం పరిశ్రమలోకి అడుగుపెట్టిన జియో.. మొత్తం టెలికం రంగ ముఖచిత్రాన్నే మార్చేసింది. ఆ తర్వాత చౌక డేటాతో వినియోగదారులకు దగ్గరైంది. అయితే నిబంధనలకు అనుగుణంగా తామూ ధరలను పెంచాల్సి వస్తున్నదని ఇప్పుడు జియో అంటున్నది. గత నెల తమ కస్టమర్లపై ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ చార్జీ (ఐయూసీ)లను జియో వేసిన విషయం తెలిసిందే. జియో నెట్‌వర్క్ నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు వెళ్లే కాల్స్‌పై నిమిషానికి 6 పైసల చొప్పున వసూలు చేస్తున్న సంగతీ విదితమే. ఇందుకోసం రెగ్యులర్ ప్యాకేజీలకు అదనంగా ఈ రూ.10 నుంచి వెయ్యి రూపాయల వరకు టాప్‌అప్‌లనూ ప్రవేశపెట్టింది.
కాగా, ఆప్టికల్ ఫైబర్, బూస్టర్స్ వంటి టెలికం నెట్‌వర్క్‌ను పంచుకోవడానికి టెలికం శాఖ (డాట్) అనుమతించింది. ఒక సంస్థకు చెందిన నెట్‌వర్క్ నిర్మాణాన్ని.. మరొక సంస్థ వాడుకోవచ్చని సోమవారం విడుదలైన సర్క్యులర్‌లో స్పష్టం చేసింది. టెలికం శాఖ నిర్ణయంతో కాల్ డ్రాప్స్ తగ్గి, మొబైల్ డేటా స్పీడ్ పెరుగవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.