భారతీయ జీవిత భీమా సంస్థ (ఎల్ఐసీ) పాలసీ ఉన్న కస్టమర్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. గడువులోగా ప్రీమియం చెల్లించకపోయినా క్రెడిట్ కార్డుతో చెల్లిస్తే ఎటువంటి చార్జీలు ఉండవని ఎల్ఐసీ తెలిపింది. ఎల్ఐసీ డిజిటల్ లావాదేవీలను మరింతగా ప్రోత్సహించేందుకు క్రెడిట్ కార్డు చెల్లింపులపై చార్జీలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. రుణంపై వడ్డీ చెల్లింపులు, లోన్ చెల్లింపులు, కొత్త ప్రీమియం, ప్రీమియం రెన్యూవల్ వంటి లావాదేవీలను క్రెడిట్ కార్డును ఉపయోగించి చెల్లిస్తే ఎటువంటి చార్జీలను విధించబోమని ఎల్ఐసీ స్పష్టం చేసింది.
మై ఎల్ఐసీ యాప్ డౌన్ లోడ్ చేసి వినియోగదారులు ఆన్ లైన్ లావాదేవీలు చేసుకోవాలని ఎల్ఐసీ తెలిపింది. ఇకనుండి కొత్త ప్రీమియం, లోన్ చెల్లింపులు, వడ్డీ చెల్లించేటప్పుడు క్రెడిట్ కార్డు వాడితే దానిపై ఎలాంటి అదనపు రుసుములు ఉండవు. ఎల్ఐసీ డిసెంబర్ నెల 1వ తేదీ నుండి ఈ విధానం అమలులోకి వచ్చిందని ఒక ప్రకటనలో తెలిపింది. ఎల్ఐసీ పాయింట్ ఆఫ్ సేల్ యంత్రాల్లోను, ఆన్ లైన్ లోను నిర్వహించే లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు ఉండవని పేర్కొంది.
అన్ని రకాల ఆన్ లైన్ సేవలకు మై ఎల్ఐసీ యాప్ లో వీలు కల్పించామని, పాలసీదారులు ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని ఎల్ఐసీ సూచించింది. ఎల్ఐసీ ఆర్బీఐ సూచనల మేరకు డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించటం కొరకు ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఎలాంటి కన్వీనియర్స్ ఫీజును వసూలు చేయమని ఎల్ఐసీ తెలిపింది. కంపెనీ తీసుకున్న తాజా నిర్ణయంతో క్రెడిట్ కార్డు ఉపయోగించి లావాదేవీలను ఉచితంగా నిర్వహించుకోవచ్చు.