ఫ్రీగా గోవా ట్రిప్‌ వెళ్లే అవకాశం ఎగిరిగంతేస్తాం..! అదే లేటెస్ట్‌ ఐ ఫోన్‌ ఫ్రీ ఇస్తామంటే కళ్లకు అద్దుకొని తీసుకుంటాం...! ఇక ఎలక్ట్రిక్‌ బైక్‌ అంటే వావ్‌ బంపర్ ఆఫర్‌ అనుకుంటాం. ఐతే.. తమకు ఇవేం వద్దంటున్నారు ప్రయాణీకులు. ఓ ట్రావెల్ ఏజెన్సీ టికెట్‌ బుకింగ్‌ యాప్‌ ప్రయాణీకులకు ఇస్తున్న గిఫ్ట్స్‌లో లక్షల విలువ చేసే కాస్ట్‌లీ ఐటమ్స్‌ ఉన్నప్పటికీ.. 3 కిలోల ఉల్లిగడ్డలు గిఫ్ట్‌గా కావాలి అని కోరుతున్నారట. 


ఉల్లిగడ్డ బంగారమైంది. కిలో ఉల్లి రెండొందలకు చేరింది. ధర ఎక్కువైనా పరవాలేదు కొందామంటే ఉల్లిగడ్డ జాడలేకుండా పోయింది. రైతు బజార్లను వీడి మొన్నటిదాకా సూపర్‌ మార్కెట్ లలో మెరిసిన ఉల్లి... నేడు అక్కడా లేకుండా పోయింది. ఉల్లి లేని కూరలేక.. పస్తులుండలేక... ఉల్లి కొనలేక... ఏం తినేటట్టు లేదు ఏం కొనేటట్టు లేదన్నట్టు తయారైంది పరిస్థితి . 

 

బస్‌ టికెట్స్‌ బుకింగ్‌ యాప్‌.. ఓ సరికొత్త ఆఫర్‌ను ప్రయాణీకులకు అందిస్తోంది. తమ యాప్‌ ద్వారా టికెట్స్‌ బుకింగ్‌ చేసుకున్న ప్రయాణికుల్లో లక్కీ కస్టమర్లను ఎంపికచేసి... ఫ్రీ గోవా ట్రిప్‌, లేటెస్ట్‌ ఐఫోన్‌, ఎలక్ట్రిక్‌ బైక్‌లను గిఫ్ట్‌లుగా అందజేస్తోంది. తాజాగా... మరో గిఫ్ట్‌ ప్యాక్‌ను కూడా వీటికి జతచేసింది. అదే.. 3 కిలోల ఉల్లిగడ్డల గిఫ్ట్‌ ప్యాక్‌.


 
టికెట్స్‌ బుక్‌ చేసుకున్న ప్రయాణీకులు... ఏ గిఫ్ట్‌ కావాలో కూడా సెలెక్ట్‌ చేసుకోవచ్చు. అయితే.. గోవా ట్రిప్‌, ఐఫోన్‌, ఈ-బైక్‌లను కూడా కాదనుకుని ఉల్లిగడ్డల ప్యాక్‌ను గిఫ్ట్‌గా సెలెక్ట్‌ చేసుకుంటున్న వాళ్లే ఎక్కువగా ఉండటం విశేషం. దీన్ని బట్టి తెలుస్తోంది ఉల్లి క్రేజ్‌ ఏంటో. ఆ యాప్‌ అందిస్తున్న ఉల్లిగడ్డల ప్యాక్‌ గిఫ్ట్‌ను డీల్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా పేర్కొంటున్నారు ప్రయాణీకులు. 54 శాతం మంది ఉల్లి ప్యాక్‌ కావాలనే కోరుకుంటున్నారని అంటున్నారు యాప్‌ నిర్వాహకులు. 

 

సూపర్‌ మార్కెట్లలోనూ ఉల్లి ఆఫర్లు కనిపిస్తున్నాయి. 3 వేల రూపాయల షాపింగ్‌ చేసిన వారికి 2 కిలోల ఉల్లిగడ్డలు ఫ్రీ అంటూ ప్రకటిస్తున్నారు. కొంతమంది పెళ్లిలో కూడా గిఫ్ట్‌గా ఉల్లిగడ్డలు ఇవ్వడం వైరల్‌గా మారింది. ఆటోవాలాలకు డబ్బులకు బదులుగా పెద్దసైజు, చిన్న సైజు ఉల్లిగడ్డలు ఇవ్వడం ఇలాంటి ఎన్నో ఫన్నీ వీడియోలు వైరల్‌గా మారాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: