దేశంలోనే అతి పెద్దదైన బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇప్పటికే ఎన్నో రకాల పాలసీలను అందిస్తున్న విషయం తెలిసిందే. ఎల్‌ఐసీ హెల్త్, పెన్షన్, టర్మ్, మనీ బ్యాక్ ఇలా చాలా పాలసీలను అందుబాటులో ఉంచింది. సీనియర్ సిటిజన్స్ కోసం కూడా ఎల్‌ఐసీ వయ వందన యోజన పేరుతో ప్రత్యేకమైన స్కీమ్ ను అందిస్తోంది. 2020 మార్చి నెల 31వ తేదీ వరకు ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది.
ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ను కొనసాగించే లేదా తొలగించే అవకాశం ఉంది. ఈ ఎల్‌ఐసీ స్కీమ్ లో చేరాలంటే 60 సంవత్సరాల వయస్సు పై బడి ఉండాలి. సంవత్సరానికి 8 శాతం నుండి 8.3 శాతం రాబడి ఎల్‌ఐసీ వయ వందన యోజన స్కీమ్ లో చేరడం వలన పొందవచ్చు. పేమెంట్ ఆప్షన్ ప్రాతిపదికన వడ్డీ మొత్తాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. అందువలన ఈ స్కీమ్ లో చేరక ముందే పేమెంట్ ఆప్షన్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది.
నాలుగు రకాల ఆప్షన్లు వయ వందన యోజన స్కీమ్ లో చేరిన వారికి అందుబాటులో ఉంటాయి. ప్రతి నెలా ఈ స్కీమ్ ద్వారా డబ్బులను తీసుకోవచ్చు. మూడు నెలలకు ఒకసారి, ఆరు నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి కూడా ఈ స్కీమ్ ద్వారా డబ్బులను పొందే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా కనీస పెన్షన్ ను పొందాలని అనుకునేవారు లక్షన్నర రూపాయలు ముందుగా డిపాజిట్ చేయాలి.
లక్షన్నర రూపాయలు డిపాజిట్ చేస్తే ప్రతి నెలా 1000 రూపాయలు పెన్షన్ తీసుకోవచ్చు. డిపాజిట్ మొత్తాన్ని పెంచుకోవటం వలన ప్రతి నెలా పెన్షన్ తీసుకునే మొత్తాన్ని కూడా పెంచుకోవచ్చు. ఈ స్కీమ్ లో 15 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే ప్రతి నెలా 10,000 రూపాయలు పెన్షన్ ను పొందవచ్చు. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం పది సంవత్సరాలు. పది సంవత్సరాల పాటు మీరు మీ డబ్బును డిపాజిట్ చేసే అవకాశం ఉంటుంది. లోన్ సౌకర్యాన్ని కూడా ఈ స్కీమ్ కింద పొందవచ్చు. 75 శాతం వరకు మొత్తాన్ని మీరు రుణం కింద ఇన్వెస్ట్ చేసిన డబ్బులో తీసుకునే అవకాశం ఉంది.