దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న విషయం తెలిసిందే. కరోనాను అడ్డుకునేందుకు ప్రధాని మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మూడు వారాల పాటు దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉంటుందని ప్రకటన చేశారు. మోదీ తీసుకున్న నిర్ణయం వల్ల ఈ కామర్స్ సంస్థలు తాత్కాలికంగా సేవలను నిలిపివేశాయి. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ఇప్పటికే సేవలు నిలిపివేయగా తాజాగా ఈ జాబితాలో బిగ్ బాస్కెట్, గ్రోఫర్స్ చేరాయి. 
 
బిగ్ బాస్కెట్ తాత్కాలికంగా సేవలను నిలిపివేశామని... స్థానిక అధికారుల ఆంక్షల వల్ల సేవలు అందుబాటులో ఉండటం లేదని.... త్వరలోనే సేవలను పునరుద్దరిస్తామని ప్రకటన చేసింది. కేంద్రం డెలివరీలను అత్యవసర సేవలుగా పేర్కొన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల డెలివరీలను తాత్కాలికంగా ఆపాల్సిన పరిస్థితి నెలకొందని బిగ్ బాస్కెట్ ప్రకటన చేసింది. సంబంధిత అధికారులతో సమస్యకు సంబంధించిన పరిష్కారం కోసం చర్చలు జరుపుతున్నామని పేర్కొంది. 
 
 
పోలీసులు డెలివరీ బాయ్ లపై దాడులు జరిపారని... కొందరు డెలివరీ బాయ్ లు వేధింపులకు గురి కావాల్సి వస్తోందని బిగ్ బాస్కెట్ తెలిపింది. లాక్ డౌన్ కారణంగా తమ సేవలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఫ్లిప్ కార్ట్ పేర్కొంది. అధిక ప్రాధాన్యత కలిగిన ఉత్పత్తులను మాత్రమే రవాణా చేస్తున్నట్లు ప్రకటన చేసింది. ఈ సంస్థలకు సంబంధించిన సేవలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: