దేశంలో కరోనా తీవ్రంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ అమలు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దేశంలో లాక్ డౌన్ అమలు నేపథ్యంలో దేశ జీడీపీ 30 ఏళ్ల కనిష్టానికి పతనం కాబోతున్నట్లు ప్రముఖ రేటింగ్స్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. ఈ సంస్థ కరోనా వల్ల అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మాంద్యం గుప్పిట్లోకి వెళ్లిపోతుందని... దీని ప్రభావం భారత్ పై కూడా ఉండవచ్చని అంచనా వేసింది.
ఫిచ్ రేటింగ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు గణనీయంగా తగ్గనుందని... వృద్ధి రేటు కేవలం 2 శాతం నమోదయ్యే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది. చైనాలోని వుహాన్ లో పుట్టిన కరోనా వైరస్ వస్తువుల ఉత్పత్తి మరియు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపిందని... చైనాలో కరోనా వ్యాప్తి ప్రభావం పూర్తిగా తగ్గినా ఎగుమతుల పరిస్థితిలో పెద్దగా మార్పు లేదని పేర్కొంది.
2021 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరంలో కేవలం 2 శాతం వృద్ధి మాత్రమే నమోదు కావచ్చని... అంతకుమించి వృద్ధి రేటు నమోదయ్యే పరిస్థితులు కనిపించటం లేదని తెలిపింది. ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసినట్లు దేశంలో కేవలం 2 శాతం వృద్ధి రేటు నమోదైతే గత 30 సంవత్సరాలలో ఇదే అత్యంత కనిష్ట స్థాయి వృద్ధి రేటు అని చెప్పుకోవాలి.
2019 డిసెంబర్ నెలలో ఈ సంస్థ భారత్ లో 2020 - 21 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 5.6 శాతంగా ఉండవచ్చని అంచనా వేసింది. ప్రధాని మోదీ లాక్ డౌన్ ప్రకటించని వారం రోజుల ముందు 5.1 శాతంగా వృద్ధి రేటు ఉండవచ్చని ఈ సంస్థ అంచనా వేయగా... లాక్ డౌన్ అమలు నేపథ్యంలో వృద్దిరేటు 2 శాతంగా ఉండవచ్చని ప్రకటన చేసింది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలపై, సూక్ష్మ... మధ్య తరహా పరిశ్రమలపై ఎక్కువ ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది.