డిజిటల్ పేమెంట్స్ కంపెనీ ఫోన్ పే తాజాగా ఆరోగ్య బీమా పాలసీని ప్రజలకు అందించేందుకు సిద్ధమైంది. కరోనా కేర్ అనే పేరుతో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రారంభించిన ఫోన్ పే సంస్థ బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీతో పార్టనర్ షిప్ పెట్టుకుంది. కోవిడ్ 19 వ్యాధిగ్రస్తులకు ఈ పాలసీ వర్తిస్తుందని ఫోన్ పే సంస్థ తెలిపింది. కరోనా కేర్ పాలసీ ప్రీమియం కేవలం 156 రూపాయలు మాత్రమే ఉండటం ఫోన్ పే వినియోగదారులందరికీ ఒక శుభవార్త అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.
రూ. 156 ప్రీమియం పాలసీలో 50 వేల రూపాయల వరకు ఆరోగ్యబీమా కవరేజ్ లభిస్తుంది. 55 ఏళ్ళ వయసు పైబడిన కరోనా కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవచ్చు. కోవిడ్ 19 వ్యాధికి చికిత్స అందిస్తున్న ఏ ఆసుపత్రిలో ఐనా ఈ పాలసీ వర్తిస్తుంది. కోవిడ్ 19 వ్యాధి చికిత్సకు మాత్రమే కాకుండా... ఆసుపత్రిలో అడ్మిట్ కాకముందుకు అయ్యే ఖర్చులకు కూడా ఈ పాలసీ వర్తిస్తుందని సదరు సంస్థ వెల్లడించింది.
కరోనా కేర్ హెల్త్ పాలసీ ని... ఫోన్ పే యాప్ లోనే సులభంగా కొనుగోలు చేసుకోవచ్చు. ఫోన్ పే యాప్ లోని మనీ విభాగంలో కి వెళ్లి పాలసీ తీసుకోవచ్చు. పాలసీ కొనుగోలు చేసిన రెండు నిమిషాల లోపే ప్రొసీజర్ పూర్తవడంతో పాటు... పాలసీకి సంబంధించిన డాక్యుమెంట్లను కూడా క్షణాల్లో డౌన్లోడ్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తుంది సదరు సంస్థ.
ఇటీవల ఫోన్ పే ఫౌండర్ సీఈవో సమీర్ నిగమ్ మాట్లాడుతూ... 'ప్రపంచమంతటా కరోనా మహమ్మారి శర వేగంగా వ్యాప్తి చెందుతుంది. భారతదేశంలో కూడా చాలామంది వృద్ధులు కోవిడ్ 19 వ్యాధి బారిన పడుతున్నారు. అటువంటి వారికి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు చాలా తక్కువగా ఉన్నాయి. కోవిడ్ 19 కారణంగా వృద్ధులకు ఏదైనా జరిగితే వారి కుటుంబంపై ఆర్థిక భారం పడే అవకాశం ఉండొచ్చు. అందుకే ప్రతి ఒక్కరూ పాలసీ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది' అని ఆయన అన్నారు.