ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేసే ప్రతి ఒక్కరికీ పీఎఫ్ అకౌంట్ ఉంటుందనే విషయం తెలిసిందే. కేంద్రం ఇప్పటివరకు ఇతర స్కీమ్స్ తో పోలిస్తే పీఎఫ్ ఖాతాదారులకు ఎక్కువ వడ్డీ ఇస్తోంది. అయితే తాజాగా దేశంలో కరోనా, లాక్ డౌన్ వల్ల నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం పీఎఫ్ ఖాతాదారులకు భారీ షాక్ ఇవ్వడానికి సిద్ధమైందని తెలుస్తోంది. ఈపీఎఫ్‌వో వడ్డీ రేట్లలో కోత విధించవచ్చని ప్రచారం జరుగుతోంది.
2019 - 20 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌వో 8.5 శాతం వడ్డీ రేటును ప్రతిపాదించగా ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి రావాల్సి ఉంది. డెట్, ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్లపై వచ్చిన రాబడి ప్రాతిపదికన ఈపీఎఫ్‌వో 8.5 శాతం వడ్డీరేటును ప్రతిపాదించింది. మరోవైపు ఫిబ్రవరి నెలలో 1,12,000 కోట్ల రూపాయలుగా ఉన్న ఈపీఎఫ్‌వో ఇన్వెస్ట్‌మెంట్లు మార్చి నెలాఖరు నాటికి 85,000 కోట్ల రూపాయలకు పడిపోయాయి.
2015 ఆగస్ట్ నెల నుంచి ఈపీఎఫ్‌వో తమ వద్ద ఉన్న మొత్తంలో 6 శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తోంది. గత నెలలో బెంచ్ మార్క్ ఇండెక్స్ లు 30 శాతం పడిపోయాయి. దీని ప్రభావం ఈపీఎఫ్‌వో రిటర్న్స్ పై పడే అవకాశం ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్ ఖాతాదారులకు 7 శాతం కంటే ఎక్కువ వడ్డీ దక్కకపోవచ్చని తెలుస్తోంది. ఇకపోతే కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈపీఎఫ్‌వో పీఎఫ్ నిబంధనలను సవరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కోవిడ్ 19 ఆప్షన్ ద్వారా పీఎఫ్ అకౌంట్ నుంచి 75 శాతం వెనక్కు తీసుకోవచ్చు. పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి కేవలం మూడు రోజుల్లో పీఎఫ్ నగదు బ్యాంక్ ఖాతాల్లో జమ కానుంది.