ప్రధాని మోదీ మే 3 వరకు లాక్ డౌన్ ను పొడిగించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తొలుత విధించిన 21 రోజుల లాక్ డౌన్ ఈరోజుతో పూర్తయింది. లాక్ డౌన్ వల్ల దేశవ్యాప్తంగా ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్ డౌన్ వల్ల ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. విశ్లేషకులు 21 రోజుల లాక్ డౌన్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై 7-8 లక్షల కోట్ల రూపాయల మేర ప్రభావం పడనుందని తెలుస్తోంది.
మోదీ 19 రోజుల పాటు లాక్ డౌన్ ను పొడిగించడంతో మరో 8 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలుస్తోంది. లాక్ డౌన్ వల్ల 80 శాతం ఆర్థిక కార్యకలాపాలు, పెట్టుబడులు, వినియోగం ఆగిపోయాయి. అత్యవసర సేవలకు, వ్యవసాయ రంగానికి మాత్రమే కేంద్రం అనుమతులు ఇచ్చింది. కరోనా మహమ్మారి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమన దిశగా పయనిస్తోంది.
ప్రముఖ రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ అక్యూట్ అంచనాల ప్రకారం మన దేశ ఆర్థిక వ్యవస్థ రోజుకు 35,000 కోట్ల రూపాయలు కోల్పోయిందని తెలుస్తోంది. మార్చి మొదటి వారం నుంచే కరోనా దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రపంచ బ్యాంకు 2020 - 2021 ఆర్థిక సంవత్సరంలో 1.5 - 2.8 శాతం మేర వృద్ధి మేర వృద్ధి నమోదు చేయగలదని అంచనా వేస్తోంది. 1991 ఆర్థిక సంస్కరణల అనంతరం ఈ ఆర్థిక సంవత్సరంలోనే అత్యంత తక్కువ వృద్ధి రేటు నమోదు కానుంది.