ప్రపంచంలోనే జనాభా పరంగా అగ్ర స్థానంలో ఉన్న భారత్ వైద్య సేవల పరంగా చూస్తే మాత్రం 145వ స్థానంలో ఉంది. వైద్య సేవల పరంగా భారత్ ఉన్న స్థానం వల్ల మన దేశంలో కరోనా వ్యాపిస్తే భారత్ కరోనాను ఎదుర్కోగలదా...? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ ఇతర దేశాల ఊహలకు అందని రీతిలో భారత్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో కరోనా తీవ్రతను తగ్గించడంతో సఫలమైంది.
ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలు, ఇతర కారణాల వల్ల దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరగడంతో కేంద్రం మరోసారి లాక్ డౌన్ పొడిగింపు దిశగా చర్యలు చేపట్టింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వల్ల అన్ని దేశల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలనున్నాయి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ సంవత్సరం మైనస్ 3 శాతానికి పడిపోనున్నట్లు అంచనా వేసింది.
పదేళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఆర్థిక సంక్షోభంతో పోలిస్తే ఈ సంక్షోభం మరీ దారుణంగా ఉన్నట్టు ఐఎంఎఫ్ నివేదికలో పేర్కొంది. 2020 రెండవ అర్ధ భాగంలో కరోనా నుంచి విముక్తి పొందే అవకాశం ఉందని... అయినప్పటికీ ప్రగతి మాత్రం అంతగా లేదని ఐఎంఎఫ్ చీఫ్ ఎకానమిస్ట్ గీతా గోపినాథ్ తెలిపారు. ఐఎంఎఫ్ భారత్ లో 2020 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ 1.9 శాతానికి పరిమితం అవుతుందని అంచనా వేసింది.
అయితే ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ వేగంగా పురోగతి సాధిస్తుందని ఐఎంఎఫ్ ప్రకటించింది. అయితే ఆర్థిక వ్యవస్థ స్థిరపడిన తర్వాత 2021లో ఆర్థిక వృద్ధి 5.8గా సాగుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. అగ్రదేశాల లాక్‌డౌన్ చర్యలను ఐఎంఎఫ్ మెచ్చుకున్నా.. ఆర్థిక పతనం నుంచి ఆ దేశాలను ఎవరూ కాపాడలేరని గీతా గోపీనాథ్ అన్నారు. కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న భారత్ కు ఐఎంఎఫ్ అంచనాలు ఊరటనిచ్చేవే అని చెప్పవచ్చు.