కరోనా విజృంభణతో మోదీ సర్కార్ లాక్ డౌన్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ వల్ల గత రెండు నెలలుగా భారత్ లో వ్యాపార, వాణిజ్య సేవలు స్తంభించిపోయాయి. కేంద్రం లాక్ డౌన్ ను మే 31వ తేదీ వరకు మరోసారి పొడిగిస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో ప్రముఖ సంస్థ గోల్డ్ మన్ సాచ్ భారత్ గతంలో ఎన్నడూ లేని విధంగా మాంద్యాన్ని ఎదుర్కోబోతుందని కీలక ప్రకటన చేసింది. 
 
రెండో త్రైమాసికం నాటికి భారత్ జీడీపి 45 శాతానికి పడిపోయే అవకాశం ఉందని ఈ సంస్థ విశ్లేషించింది. గతంలో ఇచ్చిన నివేదికలో 20 శాతం తగ్గుదల ఉంటుందని అంచనా వేయగా... తాజాగా మాత్రం 45 శాతానికి పడిపోయే అవకాశం ఉందని విశ్లేషించింది. మూడో త్రైమాసికం నాటికి 20 శాతం... నాలుగో త్రైమాసికం నాటికి 14 శాతం దేశ జీడీపీ పుంజుకునే అవకాశం ఉందని గొల్డ్ మన్ సాచ్ చెబుతోంది. 
 
గోల్డ్ మన్ సాచ్ ఆర్థిక నిపుణులు ప్రచీ మిశ్రా, ఆండ్రూ టిల్టన్ 2021 సంవత్సరం నాటికి భారత్ వాస్తవ జీడీపీ 5 శాతం క్షీణించే అవకాశం ఉందని అంచనా వేశారు. భారత్ గతంలో ఇలాంటి మాంద్యాన్ని ఎప్పుడూ ఎదుర్కోలేదని వారు తమ నివేదికలో పేర్కొన్నారు. అయితే కేంద్రం ఉద్దీపన చర్యల్లో భాగంగా తాజాగా 20 లక్షల కోట రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడంతో పాటు ఎన్నో సంస్కరణలను తీసుకొస్తున్నట్టు నిర్మలా సీతారామన్ చెప్పారు. 
 
అయితే కేంద్రం ప్యాకేజీ ప్రకటించినా ఈ ప్యాకేజీ ఆర్థిక ప్రగతిపై సత్వర ప్రభావం చూపించే అవకాశం లేదని గోల్డ్ మన్ సాచ్ ఆర్థికవేత్తలు అభిప్రాపడుతున్నారు. మరోవైపు దేశంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దేశంలో ఒక్కరోజే 5,000కు పైగా కేసులు నమోదు కావడంతో కరోనా బాధితుల సంఖ్య 96.169కు చేరింది. దేశవ్యాప్తంగా 36,824 మంది కరోనా రోగులు వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా 3,029 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: