దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ పనివేళల్లో మార్పులు చేసినట్లు ప్రకటించింది. బ్యాంక్ ఖాతాదారులంతా కొత్త పని వేళల ప్రకారం బ్యాంక్ సేవలను వినియోగించుకోవాలని సూచించింది. కరోనా విజృంభణ వల్ల బ్యాంక్ పని వేళల్లో మార్పులు చేసినట్టు ఎస్బీఐ పేర్కొంది. స్టేట్ బ్యాంక్ ఖాతాదారులు నగదు లావాదేవీల కోసం, ఇతర అవసరాల కోసం బ్యాంకుకు వెళ్లాల్సి వస్తే పనివేళలు ముందుగా తెలుసుకుంటే మంచిది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు ఇతర బ్యాంకులు కూడా పనివేళల్లో మార్పులు చేసుకున్నట్టు తెలుస్తోంది. కేంద్రం నిబంధనలకు అనుగుణంగా బ్యాంక్ పని వేళలు మారాయని సమాచారం. టైమింగ్స్ మార్పుతో పాటు విధులకు తక్కువ సంఖ్యలో మాత్రమే సిబ్బంది హాజరవుతున్నారని తెలుస్తోంది. ఎస్‌బీఐ మేనేజింగ్ డైరెక్టర్ పీకే గుప్తా మాట్లాడుతూ రాష్ట్ర ప్రాతిపదికన బ్యాంకు పనివేళల్లో మార్పులు ఉంటాయని చెప్పారు.
బ్యాంకు బ్రాంచుల ఓపెనింగ్, క్లోజింగ్‌పై పలు నియంత్రణలు పెట్టినట్టు ఆయన మీడియాకు తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో ఉదయం 7 నుంచి 10 గంటల వరకు, మరికొన్ని రాష్ట్రాల్లో ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, ఇంకొన్ని రాష్ట్రాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు స్టేట్ బ్యాంక్ ఇండియా బ్రాంచ్ లు పని చేస్తాయని తెలుస్తోంది.
ఎస్బీఐ అత్యవసరమైతే మాత్రమే కస్టమర్లు బ్యాంక్ బ్రాంచులకు రావాలని... ఇంటి నుంచే బ్యాంక్ సేవలు పొందే అవకాశం కల్పిస్తున్నామని పేర్కొంది. కస్టమర్లు సైబర్ మోసాల భారీన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని... డెబిట్ కార్డు క్లోనింగ్, ఏటీఎం ఫ్రాడ్స్ తో జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. అపరిచితులకు బ్యాంక్ ఖాతా వివరాలు చెప్పవద్దని... ఎస్ఎంఎస్‌లలో వచ్చే లింక్‌లపై క్లిక్ చేయొద్దని ఎస్బీఐ ఖాతాదారులను హెచ్చరించింది.