2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి రైతుల సంక్షేమం కోసం అనేక నిర్ణయాలు తీసుకుంటోంది. రైతులను దృష్టిలో ఉంచుకుని పలు పథకాలను అమలు చేస్తోంది. రైతులకు ప్రయోజనాలను చేకూర్చడమే లక్ష్యంగా మోదీ సర్కార్ పాలన సాగిస్తోంది. ఇప్పటికే పీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్రం రైతుల ఖాతాలలో ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు జమ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కేంద్రం పీఎం కిసాన్ ఎఫ్‌పీవో యోజన స్కీమ్‌ను ఆవిష్కరించింది.
ఎఫ్‌పీవో విధానంలో కొందరు రైతులు సమూహంగా ఏర్పడి నిర్వహణ బాధ్యతలను చూసుకోవడంతో పాటు వ్యాపార కార్యకలాపాలను చేపడతారు. కొంతమంది రైతులు సమూహంగా ఏర్పడి స్కీమ్ లో రిజిష్టర్ కావడం ద్వారా కేంద్ర ప్రభుత్వం అందించే ప్రయోజనాలను పొందవచ్చు. ఒక్కో గ్రూప్ కు కేంద్ర ప్రభుత్వం 15 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం అందించనుంది. వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాస్ చౌదరీ ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలిపారు.
కేంద్రం మరిన్ని ఎఫ్‌పీవోలను ఏర్పాటు చేస్తుందని.... ఎఫ్‌పీవోలను కంపెనీల చట్టం ప్రకారమే వీటిని రిజిష్టర్ చేసుకోవాల్సి ఉంటుందని... కంపెనీలు పొందే ప్రతి ప్రయోజనాన్ని రైతులు పొందవచ్చని మంత్రి తెలిపారు. 11 మంది సన్నకారు రైతులు ఎఫ్‌పీవోలను ఏర్పాటు చేసుకోవచ్చు. రైతులు ఎఫ్‌పీవో ఏర్పాటు ద్వారా పంటను విక్రయించుకోవడంతో పాటు పురుగు మందులు, విత్తనాలు, వ్యవసాయానికి వాడే వస్తువులను కొనుగోలు చేయవచ్చు.
ఎఫ్‌పీవో విధానంలో కొనుగోలుదారులు, రైతుల మధ్య వ్యాపారులు ఉండరు. అందువల్ల కొనుగోలుదారులు, రైతులకు మేలు చేకూరుతుంది. కేంద్ర ప్రభుత్వం రాబోయే మూడేళ్లలో 10,000 ఎఫ్‌పీవోలను ఏర్పాటు చేయటమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఎఫ్‌పీవోలకు కేంద్రం ఐదు సంవత్సరాల పాటు సహాయసహకారాలు అందిస్తుంది. . ఒక్కో ఎఫ్‌పీవోకు మోదీ సర్కార్ రూ.15 లక్షల రుణం ఇవ్వనుండగా రుణం తీసుకున్న సభ్యులు ఆర్గనైజేషన్‌ను తయారు చేసుకొని పనులను ప్రారంభించాల్సి ఉంటుంది. కేంద్రం ఈ స్కీమ్ కోసం 6,866 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది.