ఇంటర్నెట్ డెస్క్: షార్ట్ వీడియో సోషల్ నెట్‌వర్కింగ్ యాప్ టిక్ టాక్ భారత్‌లో బ్యాన్ అయిన విషయం తెలిసిందే. చైనా యాప్ కావడంతో డేటా సెక్యూరిటీ లేదనే ఆరోపణతో భారత్ ఈ యాప్‌ను బ్యాన్ చేసింది. ఇక అగ్రరాజ్యం అమెరికాలో కూడా ఈ యాప్‌ నిషేధానికి పావులు కదిపారు అధ్యక్షుడు ట్రంప్. ఈ నేపథ్యంలో టిక్ టాక్ కోర్టుకెక్కి న్యాయపోరాటం చేస్తోంది. అయితే 120కోట్లకు పైగా జనాభా ఉన్న భారత్‌లాంటి దేశంలో బ్యాన్ అయినప్పటికీ, అమెరికాలో ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ సంపాదనలో మాత్రం టిక్ టాక్ దూసుకుపోతోంది.

2020లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన యాప్‌గా రికార్డు సృష్టించింది. మొత్తంగా 540 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించి ఔరా అనిపించింది. దీని తర్వాతి స్థానంలో డేటింగ్ యాప్ టిండర్ 513 మిలియన్ డాలర్లతో నిలిచింది. యాప్ అనలిటిక్స్ సంస్థ యాప్‌టోపియా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ జాబితాలో యూట్యూబ్ మూడోస్థానంలో ఉంది. గతేడాది అది 478 మిలియన్ డాలర్లు ఆర్జించింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా డిస్నీ ప్లస్(314 మిలియన్ డాలర్లు), టాన్సెంట్ వీడియో(300 మిలియన్ డాలర్లు) ఉండగా.. 209 మిలియన్ డాలర్లతో నెట్‌ఫ్లిక్స్ యాప్ పదో స్థానంలో ఉంది

గతేడాది కూడా డౌన్‌లోడ్లలో టిక్‌టాక్ టాప్‌లోనే నిలిచింది. 2020లో ఏకంగా 850 మిలియన్ల డౌన్‌లోడ్లను టిక్ టాక్ నమోదు చేసింది. ఆ తర్వాత స్థానంలో 600 మిలియన్ డౌన్‌లోడ్లతో వాట్సాప్, 540 మిలియన్ డౌన్‌లోడ్లతో ఫేస్‌బుక్ నిలిచాయి. 503 మిలియన్ డౌన్‌లోడ్లతో ఇన్‌స్టాగ్రామ్ నాలుగోస్థానంలో, 477 మిలియన్ల డౌన్‌లోడ్లతో జూమ్ ఐదో స్థానంలో ఉన్నాయి. ఫేస్‌బుక్ మెసెంజర్‌ను 404 మిలియన్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. టాప్‌5లో ఉన్న యాప్‌లలో ఫస్ట్ ప్లేస్ మినహా.. మిగతా నాలుగూ ఫేస్‌బుక్ సొంతమైనవే కావడం గమనార్హం.

ఏది ఏమైనా బ్యాన్‌ను ఎదుర్కొంటున్నప్పటికీ ఆదాయంలోనూ, డౌన్‌లోడ్లలోనూ టిక్‌టాక్ అగ్రస్థానంలో నిలవడం గ్రేట్ అనే చెప్పాలి. ఒకవేళ భారత్ లో కూడా టిక్ టాక్ కొనసాగుతూనే ఉంటే ఇంకెంత సంపాదించేదో మరి.  భారత్‌లో టిక్‌టాక్‌పై నిషేధం విధించిన తర్వాత ఎంఎక్స్ టకా టక్, జోష్ వీడియోస్, మోజ్ వంటి షార్ట్ ఫామ్ వీడియో యాప్స్ పాపులర్ అయినట్టు యప్‌టోపియా నివేదికలో వెల్లడైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: