1. పాన్ కార్డు కోసం ఎవరైనా, సరే.. దరఖాస్తు చేసుకోవచ్చు.
చిన్న వారైనా, పెద్ద వారైనా, సరే.. వయోపరిమితి తో సంబంధం లేకుండా పాన్ కార్డ్ కి దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరమైన డాక్యుమెంట్స్ పొందుపరిచి మైనర్లు కూడా పాన్ కార్డు పొందొచ్చు. ప్రవాసులు, విదేశీయులు, విదేశీ కంపెనీలు సైతం పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
2. దరఖాస్తుదారులు తమ పాన్‌ను తక్షణమే పొందొచ్చు.
ప్రాధాన్యత ప్రాతిపదికన పాన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు వెంటనే పాన్ కార్డు పొందొచ్చు. వారు చేయాల్సిందల్లా ఎన్ఎస్డీఎల్, యూటీఐటీఎస్ఎల్ వెబ్‌సైట్స్ ద్వారా ఆన్లైన్లోనే పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. అయితే నామినేటెడ్ క్రెడిట్ కార్డ్ ద్వారా పాన్ కార్డు కోసం ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
3. పాన్ కార్డు నంబర్ కార్డుదారుల సమాచారాన్ని తెలుపుతుంది.
ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన 10 అంకెల ఆల్ఫాన్యూమరిక్స్ గల పాన్ కార్డు నంబర్ కేటాయిస్తుంది. అయితే పాన్ కార్డ్ నంబర్ లో మొదట 5 ఆల్ఫాబెటికల్స్ మనం చూడొచ్చు. ఆ తర్వాత 4 అంకెలు ఉంటాయి. ఆ తర్వాత ఒక ఆల్ఫాబెట్ ఉంటుంది. నాలుగవ స్థానంలో ఉండే క్యారెక్టర్ కార్డుదారుల స్టేటస్ తెలుపుతుంది. ఉదాహరణకి 4వ స్థానంలో పి అనే క్యారెక్టర్ ఉంటే పర్సన్ అని అర్థం. సీ ఉంటే కంపెనీ.. ఎఫ్ ఉంటే ఫర్మ్ (సంస్థ).. ఎ అంటే అసోసియేషన్.. టీ అంటే ట్రస్ట్ అని అర్థం. అయితే ఐదవ స్థానంలో ఉండే క్యారెక్టర్ కార్డుదారుల ఇంటిపేరును వెల్లడిస్తుంది.
4. పాన్ దరఖాస్తులో తండ్రి పేరును పొందుపరచడం తప్పనిసరి కాదు.
గతంలో ప్రజలు పాన్ దరఖాస్తులో తండ్రి పేరును సబ్మిట్ చేసే వారు. వారి తండ్రి పేర్లుకూడా పాన్ కార్డ్ పై ప్రింట్ అయ్యేవి. కానీ ఇప్పుడు తండ్రి పేరు ఇవ్వకుండానే పాన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 2018 డిసెంబర్ 5న అమలు లోకి వచ్చిన కొత్త రూల్ ప్రకారం దరఖాస్తుదారులు తమ తల్లి లేదా తండ్రి పేరును పొందుపరచాలి.
5. కార్డుదారులు వారి పాన్ ఇష్యూ తేదీని తెలుసుకోవచ్చు.
పాన్ కార్డుదారులు వారి పాన్ ఎప్పుడు ఇష్యూ అయ్యిందనే విషయాన్ని కూడా ఈజీగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం పాన్ కార్డు కింద భాగంలో రైట్ సైడ్ లో ఫోటో పక్కన నిలువుగా ప్రింటు చేసిన అంకెలను గమనిస్తే తెలిసిపోతుంది.