ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకటే విధానం... పర్యావరణ పరిరక్షణ. బడా కార్పోరేట్ సంస్థలు మొదలు... ప్రభుత్వాలు కూడా ప్రస్తుతం పర్యావరణ పరిరక్షణ కోసం ఇంధన వాడకాన్ని తగ్గిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు కూడా రోజు రోజుకు ఆకాశాన్ని అంటుతుండటంతో పాటు... వాటితో నడిచే కార్ల మెయింటెనెన్స్ కూడా తడిసి మోపెడు అవుతుండటంతో... పెట్రోల్ వద్దు... విద్యుత్ ముద్దు అంటున్నారు వినియోగదారులు కూడా. ఇప్పటికే విద్యుత్ స్కూటర్ల వినియోగం భారీగా పెరిగింది. ప్రముఖ ఆన్‌లైన్ సంస్థ ఓలా కూడా ఇప్పటికే తమ సొంత స్కూటర్లను మార్కెట్‌లోకి విడుదల చేసేసింది. కార్ల సంస్థలు కూడా ఇప్పటికే అన్ని రకాల వాహనాలను విద్యుత్‌తో నడిచేలా ఇప్పటికే డిజైన్ చేస్తున్నాయి. మారుతి మొదలు... పెద్ద పెద్ద సంస్థలు కూడా ఇప్పుడు విద్యుత్ వాహనాల తయారీపైనే పూర్తిగా దృష్టి పెట్టాయి. వోల్వో సంస్థ అయితే... వచ్చే ఏడాది నుంచి కేవలం విద్యుత్ కార్లు మాత్రమే తయారు చేస్తున్నట్లు ప్రకటించేసింది కూడా.

తాజాగా ఈ పోటీని తట్టుకునేందుకు జర్మనీకి చెందిన ఆడి కార్ల సంస్థ కూడా విద్యుత్ కార్ల తయారీని ప్రారంభించింది. ఇప్పుడు తాజాగా రెండు కొత్త మోడళ్లను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది ఆడి సంస్థ. ఇ-ట్రాన్  పేరుతో రెండు కొత్త రకం సూపర్ కార్ల మోడల్స్‌ను ఆడి రిలీజ్ చేసింది. ఇ-ట్రాన్ జీటీ, ఇ-ట్రాన్ ఆఎస్ జీటీ అని ఈ రెండు మోడల్స్‌కు పేరు పెట్టింది. ఇ-ట్రాన్ జీటీ ధర 1.79 కోట్ల రూపాయలు కాగా...  ఇ-ట్రాన్ ఆఎస్ జీటీ ధర ఏకంగ 2.04 కోట్ల రూపాయలుగా నిర్ణయించింది. ఇ-ట్రాన్ ఆఎస్ జీటీలో 475 కిలోవాట్‌ల విద్యుత్‌తో నడుస్తుందని... 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 3.3 సెకన్లలో మాత్రమే చేరుకుంటుందని ఆడి సంస్థ వెల్లడించింది. ఒకసారి ఛార్జింగ్ చేస్తే... 400 నుంచి 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించేలా బ్యాటరీ సామర్థ్యం ఉందన్నారు. కేవలం 22 నిమిషాల్లోనే పూర్తిస్థాయిలో ఛార్జింగ్ అవుతాయని... కూడా కంపెనీ ప్రతినిధులు తెలిపారు.  ఇప్పటికే భారత్‌లో అందుబాటులో ఉన్న విద్యుత్ కార్లతో పోలిస్తే... అత్యుత్తమ ఫిచర్లతో... అత్యాధునిక వసతులతో కూడిన కార్లు ఇవే అని ఆడి సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. త్వరలోనే మరో నాలుగు కొత్త మోడల్స్ కూడా భారత మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు ఆడి ప్రకటించింది. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న విద్యుత్ కార్ల కంటే కూడా ఇవి ఎక్కువ ధరగా ఉన్నట్లు వినియోగదారులు చెబుతున్నారు. చూడాలి.... ఆడి విద్యుత్ కార్లకు గిరాకీ ఎలా ఉంటుందో మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: