క్రెడిట్‌ స్కోరు బలంగా ఉంటేనే భవిష్యత్‌లో గృహ రుణం వంటి పెద్ద, దీర్ఘకాలిక రుణాలు, వ్యక్తిగత రుణం వంటి అసురక్షిత రుణాలు సులభంగా లభిస్తాయి.రుణాల విషయంలో క్రెడిట్‌ స్కోరు ముఖ్య పాత్ర పోషిస్తుంది. దీన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఒక్కోసారి రుణదాతలు, క్రెడిట్‌ బ్యూరోలకు తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల కూడా క్రెడిట్‌ స్కోరు తగ్గొచ్చు. అందువల్ల ఎప్పటికప్పుడు క్రెడిట్‌ నివేదికలను పరిశీలిస్తూ ఉండాలి. దీంతో ఏదైనా పొరపాట్లు జరిగినా సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది.రుణాలు ఎక్కువగా ఉంటే ఆర్థిక భారం, ఒత్తిడి పెరుగుతాయి. రుణం తీసుకున్న మొత్తం తక్కువగా ఉన్నప్పటికీ రుణాల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడూ కూడా గందరగోళానికి గురై చెల్లింపులు సరిగ్గా చేయలేకపోవచ్చు. ఇటువంటి సందర్భాల్లో క్రెడిట్‌ స్కోరు తగ్గే ప్రమాదం ఉంది. అదేవిధంగా ఎక్కువసార్లు రుణ కోసం దరఖాస్తు చేయడం కూడా మంచిది కాదు. కొందరు ఒక బ్యాంకులో రుణం దరఖాస్తు తిరస్కరణకు గురైతే వెంటనే మరొక బ్యాంకులో ప్రయత్నిస్తారు. ఇలా చేయడం వల్ల కూడా క్రెడిట్‌ స్కోరు తగ్గుతుంది. ముందుగా తిరస్కరణకు గల కారణాలు తెలుసుకోవాలి. వాటిని సరిదిద్దుకున్న తర్వాత మాత్రమే మరోసారి ప్రయత్నించాలి.


ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఒక్కో నెల ఈఎంఐ చెల్లింపులు ఆలస్యం కావచ్చు. తర్వాతి నెలలు ఈఎంఐలను సమయానికి చెల్లించడం ద్వారా క్రెడిట్‌ స్కోరు తగ్గకుండా కాపాడుకోవచ్చు. కానీ తరుచూ ఇదే విధంగా జరుగుతుంటే మాత్రం క్రెడిట్‌ స్కోరులో ఘననీయమైన తగ్గుదల నమోదు అవుతుంది. అందువల్ల మీ ఈఎంఐలను సమయానికి చెల్లించండి. ఇప్పటికే రుణాలు ఉన్నవారు కొత్త రుణాల కోసం ప్రయత్నించకపోవడమే మంచిది. ఒకవేళ ప్రయత్నించినా కొత్త, పాత రుణాల మొత్తం ఈఎంఐలు ఆదాయంలో 40 శాతం మించకుండా చూసుకోవడం ద్వారా ఆర్థిక భారం పడకుండా చూసుకోవచ్చు.ప్రస్తుత రుణాలు, పాత రుణాలు, ఈఎంఐ చెల్లింపుల విధానం, మీ వద్ద ఉన్న క్రెడిట్‌ కార్డులు, బిల్లు చెల్లింపులను చెక్‌ చేసుకోండి. ఒకసారి కారణం తెలిస్తే సరిదిద్దుకోవడం సులభం అవుతుంది.ప్రతి క్రెడిట్‌ కార్డుకీ కొంత లిమిట్‌ ఉంటుంది. పరిమితి ఉంది కదా అని చివరి రూపాయి వరకు వినియోగించుకోవడం సరికాదు. ఇది మీ క్రెడిట్‌ స్కోరు పతనానికి కారణం అవుతుంది.


మీ క్రెడిట్‌ లిమిట్‌లో వినియోగం 30 శాతానికి మించకుండా చూసుకోవాలి. దీన్నే క్రెడిట్‌ వినియోగ నిష్పత్తి (CUR) అంటారు. ఇంతకు మించి ఖర్చు చేస్తే.. మీరు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారని, నష్టభయం ఎక్కువగా ఉంటుందని క్రెడిట్‌ బ్యూరో సంస్థలు అంచనా వేస్తాయి. దీంతో క్రెడిట్‌ స్కోరు తగ్గే అవకాశం ఉంది. క్రెడిట్‌ కార్డును రద్దు చేయడం వల్ల అందుబాటులో ఉన్న క్రెడిట్‌ మొత్తం తగ్గుతుంది. కాబట్టి క్రెడిట్‌ స్కోరు తగ్గే ప్రమాదం ఉంది. ఎక్కువ క్రెడిట్‌ కార్డులు ఉన్నవారు ఒక కార్డు రద్దు చేయాలంటే.. ఎప్పటి నుంచో ఉన్న పాత కార్డును రద్దు చేసే కంటే కొత్త కార్డును రద్దు చేయడం మంచిది. లేదా కొత్త కార్డులో ఎక్కువ ఆఫర్లు ఉన్నాయంటే.. పాత కార్డుకు ధీటుగా క్రెడిట్‌ లిమిట్‌ ఉండేలా చూసుకోవడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: