దేశంలో కార్మికుల నుంచి ఉద్యోగుల వరకు కూడా నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS), ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF), అటల్ పెన్షన్ యోజన (APY) లాంటి పెన్షన్ పథకాలు ఉన్నాయి. అయితే ఈ పెన్షన్ పథకాలు అందరికీ వర్తించవు. వీటికి కొన్ని అర్హతలు ఉంటాయి. అటల్ పెన్షన్ యోజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇటీవల నియమనిబంధనల్ని మార్చింది. ఇకపై ఈ స్కీమ్‌లో చేరడానికి అందరూ అర్హులు కాదు. అటల్ పెన్షన్ యోజన పథకంలో ఆదాయపు పన్ను చెల్లింపుదారులు చేరకుండా ఆంక్షలు విధించింది కేంద్ర ప్రభుత్వం.కొత్త నిబంధనల ప్రకారం ఎవరైనా సబ్‌స్క్రైబర్ 2022 అక్టోబర్ 1న లేదా ఆ తర్వాత అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరి, ఆ తర్వాత ఆదాయపు పన్ను చెల్లింపుదారులుగా మారితే, వారి ఏపీవై అకౌంట్ క్లోజ్ అవుతుంది. అప్పటివరకు జమ చేసిన మొత్తాన్ని సబ్‌స్క్రైబర్‌కు వెనక్కి ఇచ్చేస్తుంది ప్రభుత్వం. అయితే ప్రస్తుతం ఈ పెన్షన్ స్కీమ్‌లో డబ్బులు జమ చేస్తున్నవారు, ఆదాయపు పన్ను మినహాయింపులు పొందవచ్చా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. నోటిఫికేషన్‌లో APY స్కీమ్ కంట్రిబ్యూషన్‌కు సంబంధించిన ఆదాయపు పన్ను చిక్కులపై ఎలాంటి వివరాలు లేవని, దీనిపై స్పష్టత వచ్చేవరకు సబ్‌స్క్రైబర్లు పెట్టుబడి పెట్టడం, పన్ను ప్రయోజనాలను పొందడం కొనసాగించవచ్చని BankBazaar.com సీఈఓ ఆదిల్ షెట్టి తెలిపారు. 


అటల్ పెన్షన్ యోజన సబ్‌స్క్రైబర్‌లు ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80CCD(1) కింద పన్ను మినహాయింపులు పొందవచ్చు. గరిష్టంగా రూ. 1,50,000 వరకు మినహాయింపు పొందవచ్చు. అయితే సెక్షన్ 80CCD (1B) ప్రకారం అదనంగా మరో రూ.50,000 వరకు కంట్రిబ్యూషన్ చేసి మినహాయింపు పొందవచ్చు. అటల్ పెన్షన్ యోజన పథకం ప్రధానంగా అసంఘటిత రంగంలోని వారి కోసం రూపొందించిన పథకం. అయితే పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం ఉన్నవారికి నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఆకర్షణీయమైన ఆప్షన్ అని ఆదిల్ షెట్టి వివరించారు. అటల్ పెన్షన్ యోజన పథకం వివరాలు చూస్తే ఈ స్కీమ్ 2015 మే 9న ప్రారంభమైంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) ఈ పథకాన్ని నిర్వహిస్తోంది. ఈ పెన్షన్ పథకంలో డబ్బులు జమ చేసినవారికి 60 ఏళ్ల వయస్సు నుంచి రూ.1,000 నుంచి రూ.5,000 వరకు పెన్షన్ లభిస్తుంది. జమచేసే మొత్తంపై పెన్షన్ ఆధారపడి ఉంటుంది. లబ్ధిదారుల వయస్సును బట్టి రూ.42 నుంచి రూ.1,454 మధ్య జమ చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: