అవును, మీరు విన్నది నిజమే. ఓ చైనా కంపెనీ తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే, చైనాలోని హెనాన్ మైనింగ్ క్రేన్ కంపెనీ తన ఉద్యోగులకు ఊహించని రీతిలో సంవత్సరాంతపు బోనస్ ప్రకటించి అందరినీ ఉబ్బితబ్బిబ్బయేలా చేసింది. కంపెనీ ఒక పెద్ద టేబుల్‌పై 11 మిలియన్ సింగపూర్ డాలర్లు (68 కోట్ల రూపాయలు) ఇంచి, ఉద్యోగులు కేవలం 15 నిమిషాల్లో ఎంత డబ్బునైతే లెక్కిస్తారో అంత డబ్బును ఇంటికి తీసుకెళ్లొచ్చని ప్రకటించింది. దాంతో దొరికిందే పెద్ద అవకాశం అనుకొని ఉద్యోగులు డబ్బులు ఆదరాబాదరా లెక్కపెట్టి తోచినంత తీసుకెళ్లారు.

సదరు తంతుకి సంబందించిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. వీడియోని గమనించినట్లయితే, టేబుల్‌పై డబ్బులు కుప్పలు కుప్పలుగా ఉండడం మనం చూడవచ్చు. ఈ క్రమంలో ఉద్యోగులు డబ్బుల కట్టలను ఎంతో ఆత్రుతగా లెక్కపెడుతున్నట్టు కనబడుతోంది. ఒక ఉద్యోగి అయితే కేవలం 15 నిమిషాల్లోనే 100,000 యువాన్ (సుమారు 18,700 సింగపూర్ డాలర్లు) లెక్కించాడు. “హెనాన్ కంపెనీ తన ఉద్యోగులకు సంవత్సరాంతపు బోనస్‌గా మిలియన్లను ఇస్తోంది.ఉద్యోగులు ఎంత డబ్బునైతే లెక్కించగలరో అంత డబ్బును ఇంటికి తీసుకెళ్లవచ్చు” అని వీడియోకు క్యాప్షన్ కూడా ఇవ్వడం ఇక్కడ గమనించవచ్చు.

కాగా ఈ బోనస్ పై సోషల్ మీడియాలో అయితే నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు “మా కంపెనీ కూడా ఇలానే ఇస్తూ ఉంటుంది. అయితే డబ్బుకు బదులుగా పనిని ఇస్తుంది!” అని కొంటెగా కామెంట్స్ చేస్తే, మరికొందరు “దీనికంటే డబ్బును నేరుగా ఖాతాల్లో వేయొచ్చు కదా. ఓ రకంగా ఇది అవమానించినట్లు ఉంది!” అంటూ కామెంట్స్ చేయగా... “టీమ్ బాండింగ్ పేరుతో చేసే వాటికంటే ఇలాంటివి ఎక్కువ ఉండాలి” అని కామెంట్స్ చేసారు. ఇకపోతే హెనాన్ మైనింగ్ క్రేన్ కంపెనీ భారీ నగదు బహుమతులు ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. 2023లో కూడా కంపెనీ తన వార్షిక విందులో ఉద్యోగులకు భారీ బోనస్‌లు ప్రకటించి టాక్ అఫ్ ది టౌన్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: