అవును, మీరు విన్నది నిజమే. అదేమిటి కంటికి కనిపించని ఆర్టుకి లక్షల రూపాయిలా? అని ఆశ్చర్యపోతున్నారా? మీరు విన్నది నిజమే. ఇటాలియన్ కళాకారుడు అయినటువంటి "సాల్వటోర్ గరౌ" భౌతికంగా కనిపించని ఓ చిత్రాన్ని రూపొందించారు. అయితే ఇది భౌతికంగా కనిపించనప్పటికీ అక్కడ ఏదో రూపం ఉందనే భావన మాత్రం కలిగిస్తుంది. కాగా దీనిని విక్రయించేందుకు వేలం నిర్వహించగా భారీ డిమాండ్ కనిపించింది. దాంతో ఓ ఔత్సాహిక వ్యక్తి ఏకంగా దానిని $18,300 (రూ.15లక్షలు)కు కొనుగోలు చేయడం జరిగింది.
అయితే మనదేశపు చిత్రకళకు కూడా విదేశాల్లో భారీ డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే గత సంవత్సరం 18వ శతాబ్దపు కాంగ్రా కళాకారుడు నైన్సుఖ్ గీసిన 2 గులేర్ మినియేచర్ పెయింటింగ్ కి ముంబైలో జరిగిన వేలంలో రికార్డు స్థాయిలో రూ.31 కోట్లు పలకడం గమనార్హం. నైన్సుఖ్ వారసుడు గీసిన శ్రీకృష్ణుని పెయింటింగ్ రూ. 16 కోట్లు పలకగా 1750 నాటి నైన్సుఖ్ కళాఖండం రూ. 15 కోట్లకు అమ్ముడైంది. ఇది రాజా బల్వంత్ దేవ్ సంగీత వేడుకను నిర్వహిస్తున్నట్లు చిత్రీకరించబడింది. 2వ కళాకృతి విషయానికొస్తే... 1775లో సృష్టించబడిన 12వ శతాబ్దపు సంస్కృత కవి జయదేవుని పద్యంలోని దృశ్యం. పచ్చని బృందావన తోటలో గోపికలతో కలిసి కృష్ణుడు నృత్యం చేస్తున్నట్లు చూపిస్తుంది. అదేవిధంగా ఆమధ్య ఆస్ట్రియాలో 100 ఏండ్ల క్రితం కనిపించకుండా పోయిన 54 మిలియన్ డాలర్ల (రూ. 448 కోట్లు) విలువైన పెయింటింగ్ దొరకగా దానికోసం ఔత్సాహికులు భారీగా పోటీపడినట్టు సమాచారం.