
రతన్ టాటాకు జర్మన్ షెపర్డ్ జాతి కుక్కలంటే చాలా ఇష్టం. ఆయనకు గతంలో టిటో అనే జర్మన్ షెపర్డ్ ఉండేది. అది చనిపోయాక, మళ్లీ ఆరేళ్ల క్రితం ఇంకో జర్మన్ షెపర్డ్‌ను ఇంటికి తెచ్చుకున్నారు. దానికి కూడా టిటో అనే పేరు పెట్టారు. ఈ టిటో అంటే టాటాకు చాలా ప్రేమ. ఆ ప్రేమను ఆయన తన వీలునామాలోనూ చూపించారు. టిటో బాగోగుల కోసం ఏకంగా రూ.12 లక్షలు పక్కన పెట్టారంటే ఆయన ప్రేమ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రతి మూడు నెలలకు టిటో ఖర్చుల కోసం రూ.30,000 ఇస్తారు. టాటా గారింట్లో వంట చేసే రాజన్ షా అనే వ్యక్తి టిటోను కంటికి రెప్పలా చూసుకుంటారట.
కుక్కలంటే ఆయనకున్న ప్రేమ గురించి చెప్పడానికి ఒక చిన్న సంఘటన చాలు. 2018లో కింగ్ చార్లెస్ ఒక పెద్ద అవార్డు ఫంక్షన్ ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది గొప్పవాళ్లకు ఆ కార్యక్రమంలో అవార్డులు ఇచ్చారు. అందులో రతన్ టాటాకు కూడా ఒక అవార్డు ఉంది. కానీ, ఆ కార్యక్రమానికి టాటా గారు వెళ్లలేదు. ఎందుకో తెలుసా? ఆయన పెంపుడు కుక్క టిటో అప్పుడు బాగోలేదట.
అవార్డు కంటే తన పెంపుడు కుక్క ఆరోగ్యం ముఖ్యం అనుకున్నారాయన. ఈ విషయం విన్న ప్రిన్స్ చార్లెస్ ఏమన్నారో తెలుసా? "ఆయనే నిజమైన మనిషి. రతన్ అంటే అది. అందుకే టాటా గ్రూప్ ఈరోజు ఈ స్థాయిలో ఉంది" అని పొగిడారంటే, టాటా వ్యక్తిత్వం ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. గత సంవత్సరం జులైలో ముంబైలోని మహాలక్ష్మిలో భారతదేశపు మొట్టమొదటి చిన్న జంతువుల ఆసుపత్రిని టాటా గారు ప్రారంభించారు. ఆ హాస్పిటల్‌లో పెంపుడు జంతువుల కోసం ఐసీయూలు, హెచ్‌డీయూలు, సీటీ స్కాన్‌లు, ఎక్స్‌రేలు, ఎంఆర్‌ఐ మెషీన్లు అన్నీ ఉన్నాయి. పెంపుడు జంతువులకు అంతర్జాతీయ స్థాయిలో ట్రీట్‌మెంట్ అందించాలనేది ఆయన సంకల్పం.
టాటా కేవలం పెంపుడు జంతువులనే కాదు.. తన ఉద్యోగులను, తనతో పనిచేసేవాళ్లను కూడా సొంత కుటుంబంలా చూసుకునేవారు. ఆయన వీలునామాలో తన కుటుంబ సభ్యులతో పాటు, స్నేహితులు, సిబ్బంది, పెంపుడు జంతువుల బాగోగులు కూడా చూడాలని రాశారు. ఆయన సంపాదించిన ఆస్తిలో చాలా భాగం, టాటా సన్స్ షేర్లతో సహా చారిటీ సంస్థలకు వెళ్తుంది.
రతన్ టాటా 2024 అక్టోబర్ 9న కన్నుమూశారు. కానీ, ఆయన తన మంచి మనసుతో, దాతృత్వంతో ఎప్పటికీ మన గుండెల్లో నిలిచిపోతారు. నిజంగా ఆయన ఒక లెజెండ్.