
ఇండియాలో ఓ పెద్ద మార్పు వస్తోందని గట్టిగా నమ్ముతున్నారు. ఓ మంచి చదువు, ఓ మంచి వైట్ కాలర్ జాబ్.. ఇదే ఇప్పటిదాకా మన లైఫ్ ప్లాన్. కానీ, ఈ ట్రెండ్ పోతోందట. దాని స్థానంలో సొంతంగా వ్యాపారాలు, స్టార్టప్‌లు పెట్టుకునే వాళ్ల సంఖ్య పెరుగుతోంది. ఈ దశాబ్దంలో నెల జీతాలకు గుడ్ బై చెప్పి, సొంత కాళ్లపై నిలబడే వాళ్లే ఎక్కువ కనిపిస్తారని ముఖర్జీయా జోస్యం చెబుతున్నారు.
"చదువుకుని, కష్టపడి పనిచేసే తెలివైన వాళ్లకు నెల జీతం జాబ్స్ ఇక సరిపోవు. సొంతంగా ఏదైనా చేయడంలోనే భవిష్యత్తు ఉంది" అని ఆయన తేల్చి చెప్పారు. ఉదాహరణగా, "జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్" అంటూ ఓ వీడియోతో రాత్రికి రాత్రే ఫేమస్ అయిన జాస్మీన్ కౌర్‌ను చూపించారు. ఆమెలాంటి వాళ్లు పెద్ద పెద్ద డిగ్రీలు, ఇన్వెస్టర్ల డబ్బులు, ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ లాంటివేవీ లేకుండానే సొంతంగా బ్రాండ్ క్రియేట్ చేసుకుంటున్నారని వివరించారు.
ఇంత పెద్ద మార్పు రావడానికి కారణం JAM ట్రినిటీ (జన్‌ధన్, ఆధార్, మొబైల్) అంటారాయన. ఈ మూడింటి దెబ్బకు బ్యాంకింగ్ సేవలు, గుర్తింపు, ఇంటర్నెట్ వాడకం అందరికీ అందుబాటులోకి వచ్చాయి. దీంతో సామాన్యులు కూడా పెద్ద కలలు కనగలుగుతున్నారు. ఓ షాకింగ్ లెక్క కూడా చెప్పారు. 2024లోనే ఇండియాలో ఏకంగా 1.8 లక్షల కొత్త కంపెనీలు పుట్టుకొచ్చాయట. గతంలో ఈ సంఖ్య ఏడాదికి 60,000 మాత్రమే ఉండేది.
మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు ఊడిపోతున్నాయని కూడా ముఖర్జీయా హెచ్చరించారు. గూగుల్ లాంటి పెద్ద కంపెనీనే ఇప్పుడు మూడో వంతు కోడింగ్‌ను AI తోనే చేయిస్తోందట! ఒకప్పుడు కీలకంగా భావించిన మిడిల్ మేనేజ్‌మెంట్, సూపర్‌వైజర్ లాంటి జాబ్స్ ఇప్పుడు మెషిన్‌లే చేసేస్తున్నాయి. అంటే, మనుషులతో పని తగ్గిపోతోంది.
ఒకే కంపెనీకి ఏళ్ల తరబడి అంకితమై పనిచేసే పాత రోజులు పోయాయని కూడా ఆయన స్పష్టం చేశారు. నెల నెలా వచ్చే జీతం మోజులోంచి భారత సమాజం బయటపడాలని గట్టిగా చెబుతున్నారు. "మనం డబ్బే లోకం అనుకుంటున్నాం. మన పిల్లలకు జీతం వచ్చే జాబ్ వెతుక్కోమని కాదు చెప్పాల్సింది. వాళ్లు సంతోషంగా ఉండేలా, సమాజంపై మంచి ప్రభావం చూపేలా ఎదగమని నేర్పించాలి. ఎందుకంటే, మనం ఇప్పుడు చూస్తున్న జాబ్స్ రేపు ఉండకపోవచ్చు." అని ముఖర్జీయా ముగించారు.