ఇకపై ఇల్లు కట్టుకోవాలనుకునేవారికి లేదా నిర్మాణ రంగంలో ఉన్నవారికి ఇది నిజంగానే బ్యాడ్ న్యూస్. దేశంలో భవన నిర్మాణానికి అత్యంత కీలకమైన సిమెంట్ ధరలు రాబోయే రోజుల్లో అమాంతం పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు ఘోషిస్తున్నారు. ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం, సిమెంట్ బస్తాల ధరలు దాదాపు 4 శాతం వరకు పెరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం నడుస్తున్న ఆర్థిక సంవత్సరం 2025-26 సిమెంట్ పరిశ్రమకు నిజంగానే కలసిరానుందని క్రిసిల్ తన అంచనాల్లో పేర్కొంది. గతేడాది మాంద్యం వాతావరణం కనిపించిన ఈ రంగంలో, ఈసారి డిమాండ్ ఊపందుకోనుందని ఆశాభావం వ్యక్తం చేసింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి గిరాకీలో భారీ వృద్ధి ఉంటుందని క్రిసిల్ అంచనా వేసింది. దాదాపు 6.5 శాతం నుంచి 7.5 శాతం వరకు డిమాండ్ పెరిగే అవకాశం ఉందని చెప్తోంది.

ఇందుకు కారణాలు లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు. దేశంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు బడ్జెట్ కేటాయింపులు ఏకంగా 10 శాతం పెరగడం, గ్రామీణ ప్రాంతాల్లో గృహ నిర్మాణ కార్యకలాపాలు మళ్ళీ ఊపందుకోవడం, అలాగే వాతావరణ శాఖ ఈసారి సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం ఉంటుందని అంచనా వేయడం వంటివి సిమెంట్ రంగానికి ఈ ఏడాదికి బలం చేకూర్చనున్నాయి.

అయితే, గత ఆర్థిక సంవత్సరం 2023-24 మాత్రం సిమెంట్ పరిశ్రమకు అంతగా అనుకూలించలేదు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే డిమాండ్ వృద్ధి 4.5 శాతం నుంచి 5.5 శాతం వద్ద నిలిచిపోయింది. లోక్సభ ఎన్నికల ప్రక్రియ, కొన్ని చోట్ల కురిసిన భారీ వర్షాలు దీనికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ఫలితంగా, గతేడాది ధరలు కూడా కంపెనీలను నిరాశపరిచాయి.

ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే, గతంలో ఒక దశలో ప్రముఖ కంపెనీల సిమెంట్ 50 కిలోల బస్తా ధర రూ. 300 స్థాయికి పడిపోయింది. ప్రస్తుతం ఆ స్థాయి నుంచి కోలుకొని రూ. 350 నుంచి రూ. 360 మధ్య కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, త్వరలో సిమెంట్ ధరలు పెరిగితే, ఇల్లు కట్టుకోవాలనుకునే సామాన్యుడిపై అదనపు భారం పడడం ఖాయం. నిర్మాణ వ్యయం మరింత ప్రియం కానుంది. ఈ పెరుగుదల సామాన్యుల జేబుకు ఎంత మేర చిల్లు పెడుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: