
కావాల్సిన పదార్థాలు:
చామదుంపలు- అర కేజీ
టొమాటో ముక్కలు- అర కప్పు
అల్లంవెల్లుల్లి పేస్టు- ఒక టీ స్పూన్
గరం మసాలా- అర టీస్పూన్
నిమ్మరసం- ఒర టీ స్పూన్
పచ్చిమిర్చి- మూడు
ఉప్పు- రుచికి సరిపడ
కారం- ఒక టేబుల్ స్పూన్
కొత్తిమీర తరుగు- ఒక కప్పు
నూనె- నాలుగు టేబుల్ స్పూన్లు
మెంతులు- ఒక టేబుల్ స్పూన్
యాలకులు- రెండు
లవంగాలు- నాలుగు
సెనగపిండి- ఒక టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ- ఒకటి
వెన్న- రెండు టేబుల్ స్పూన్లు
తయారీ విధానం: ముందుగా చామదుంపలను తీసుకుని నీటిలో ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టికొంచెం నూనె వేసి కాస్త వేడి అయ్యాక టొమాటో ముక్కలు వేయాలి. అవి కాస్త వేగాక కొద్దిగా నీళ్ళు పోసి అల్లంవెల్లుల్లి, పచ్చిమిర్చి, లవంగాలు, యాలకులు, కారం వేసి మూతపెట్టి స్లో ఫ్లేమ్ పై ఉడికించాలి. టొమాటో ముక్కలు ఉడికిన తరువాత వెన్న, మెంతులు కూడా వేసి మరో రెండు నిమిషాలు ఉడికించాలి.
ఇప్పుడు అందులో తగినంత ఉప్పువేసి గ్రేవీగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందు ఉడికించుకున్న చామదుంపల పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలపై ఉప్పు, కారం, సెనగపిండి చల్లి ముక్కలన్నింటికి పట్టేలా కలపాలి. మరోవైపు స్టవ్‌పై ఒక పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి చామదుంపల ముక్కలు వేగించుకుని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు మరొక పాన్‌లో రెండు స్పూన్ల నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉప్పు వేసి వేగించాలి. తరువాత వేగించి పెట్టుకున్న చామదుంపలు వేసి కలపాలి. కాసేపు వేగిన తరువాత ముందుగా సిద్ధం చేసుకున్న గ్రేవీ కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత నిమ్మరసం, గరంమసాలా వేసి మరికాసేపు ఉడికించాలి. చివరగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. అంతే ఎంతో రుచికరమైన చామదుంప మసాలా కర్రీ రెడీ.