కావాల్సిన పదార్థాలు:
మటన్- అర కేజీ
ఉల్లిపాయ తరుగు- ఒక కప్పు
పెరుగు- మూడు టీ స్పూన్లు
నూనె- నాలుగు టేబుల్ స్పూన్లు
ధనియాల పొడి- ఒక టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్టు- ఒక టీ స్పూన్
లవంగాలు- మూడు
కారం- ఒక టీ స్పూన్
ఉప్పు- రుచికి సరిపడా
యాలకలు- రెండు
దాల్చినచెక్క- రెండు అంగుళాలు
వేగించిన ఉల్లిపాయ ముక్కలు- అర కప్పు
నీళ్లు- ఒక కప్పు
కొత్తిమీర- ఒక కట్ట
తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని.. అందులో నూనె వేసి వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అవి వేగిన తరువాత మటన్, పెరుగు, ఉప్పు, నీళ్లు, ధనియాల పొడి, కారం వేసి బాగా కలపాలి. కొద్దీ సేపు వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకలు వేసి సన్నటి మంటపై అరగంట ఉడికించాలి.
తరువాత వేగించుకున్న ఉల్లిపాయ ముక్కలువేసి మటన్ ముక్కలు మెత్తబడే వరకు ఉడికించాలి. ఇక చివరిగా కొత్తిమీర జల్లి స్టవ్ ఆప్ చేస్తే సరిపోతుంది. అంతే ఎంతో రుచిగా ఉండే మటన్ కుర్మా రెడీ అయినట్లే. దీనిని చపాతీ, రోటీలో ఎందులో తిన్నా చాలా రుచిగా ఉంటుంది. కాబట్టి, ఈ మటన్ కుర్మాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
మటన్ అంటే నాన్వెజ్ ప్రియులకు ఎంతో ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మటన్లో అధికంగా ప్రోటీన్లు ఉంటాయి. ఐరన్ ఉంటుంది. ఫ్యాట్ తక్కువ ప్రమాణాల్లో ఉంటుంది. శరీరానికి అవసరమయ్యే పోషకవిలువలు మటన్లో ఎక్కువగా ఉంటాయి. ఇది మంచి పౌష్టికాహారం. అందుకే వారంలో ఒకసారి అయినా మటన్ తినడం చాలా మంచిది.