ప్రతి రోజు కూరగాయాలు తిని తిని నోరు చప్పపడిపోయిన వాళ్ళు ఒక్కసారి టొమోటో, పుదీనా  పచ్చడిని ఒకసారి రుచి చూడండి.ఎంతో ఘాటుగా,కమ్మని వాసనతో,ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ స్టైల్ పచ్చడిని మీరు అన్నం,దోస,  ఇడ్లీ, చపాతీలలోకి కూడా కలుపుకుని తినవచ్చు. చాలా రుచిగా ఉంటుంది.అయితే పచ్చడిని మరీ మెత్తగా పేస్ట్ లా గ్రైండ్ చేయకండి.తినడానికి బాగోదు.కాస్త కచ్చా పచ్చగానే గ్రైండ్ చేసుకుంటే రుచి బాగుంటుంది.ఈ పచ్చడికి టొమాటోలు నాటువు అయితే పుల్లగా రుచి బాగుంటాయ్.హైబ్రీడ్ కాయలైతే ఇంకాస్త ఎక్కువ చింతపండు వేసుకోండి.టొమాటోలు మరీ మెత్తగా పూర్తిగా నీరు ఇగిరిపోయేదాక మగ్గించకూడదు.అలా చేస్తే అంతా రుచిగా ఉండదు పచ్చడి.

కావాల్సిన పదార్ధాలు

4 పండిన ఎర్రని టొమాటోలు

గుప్పెడు పుదీనా ఆకులు

3 tbsp నువ్వులు

8 -10 పచ్చిమిర్చి

20 వెల్లుల్లి

1 tsp జీలకర్ర

ఉసిరికాయంత చింతపండు

ఉప్పు

తాలింపుకి

1 tbsp నూనె

1 tsp ఆవాలు

1 tbsp సెనగపప్పు

1 tsp మినపప్పు

1 tsp జీలకర్ర

తయారీ విధానం:

ముందుగా స్టవ్ వెలిగించి ఒక మూకుడులో నువ్వులు వేసి సన్నని సెగ మీద కలుపుతూ చిటపటలాడించి దింపి మెత్తని పొడి చేసుకోండి. అందులోనే కొద్దిగా నూనె పోసి వేడి చేసి అందులో పచ్చిమిర్చి చీలికలు, జీలకర్ర, వెల్లుల్లి వేసి 2 నిమిషాలు వేపుకోండి.వేగిన వెల్లుల్లిలో పండిన టొమాటో ముక్కలు కాస్త ఉప్పు, చింతపండు వేసి టొమాటోలు మెత్తబడి పైన తోలు ఊడే దాకా మగ్గించుకోవాలి.టొమోటోలు నూనెలో వేగితేనే పచ్చడి రుచిగా ఉంటుంది. ఇప్పుడు మగ్గిన టొమాటో ముక్కల్లో పుదీనా ఆకులు వేసి రెండు నిమిషాల పాటు మగ్గనిచ్చి దింపేసుకోవాలి . ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో చల్లారిన టొమాటోలని, పచ్చిమిర్చి, జీలకర్ర, పుదీనా,వెల్లుల్లి పాయలు అన్ని మిక్సీ వేసి నీరు చేర్చి బరకగా రుబ్బుకోండి. తరువాత తాళింపుకి నూనె వేడి చేసి అందులో ఆవాలు, సెనగపప్పు, మినపప్పు వేసి ఎర్రగా వేపుకోవాలి.వేగిన తాళింపులో టొమాటో గుజ్జు ఇంకా నువ్వుల పొడి వేసి నూనె పైకి తేలేదాక మగ్గించి దింపేసుకోవాలి.అంతే ఎంతో రుచిగా ఉండే పుదీనా,టొమోటో పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పచ్చడి రుచి చూడండి.. చాలా బాగుంటుంది.. !!






మరింత సమాచారం తెలుసుకోండి: