పచ్చి బఠాణీ గురించి తెలియని వారు ఎవరు ఉంటారు చెప్పండి.మనం ఏదైనా వంటలు వండేటప్పుడు ఆ వంటకాలకు రుచి, వన్నె రావాలంటే పచ్చి బఠాణి వేయాలిసిందే.వీటిని వంటలలో జోడించడం వలన కంటికీ ఇంపుగా ఉండడంతో పాటు ఎటువంటి వంటకాలలో అయిన ఇట్టే కలిసిసోతుంది. పచ్చి బఠాణీలతో బోలెడు వంటకాలు చేయవచ్చు.మరి మీకోసం ఇండియా హెరాల్డ్ వారు మీకోసం పచ్చి బఠాణితో సరికొత్త వంటకాలను మీకు పరిచయం చేస్తున్నారు.మరి ఆ వంటకాలు ఏంటో తెలుసుకుని మీరు కూడా వాటిని టేస్ట్ చేసేయండి.

పచ్చి బఠాణీ ఖీర్‌: పచ్చి బఠాణితో తియ్యటి ఖీర్ కూడా చేసుకోవచ్చు తెలుసా. అది ఎలాగో తెలుసుకుందాం

కావలసినవి: పచ్చి బఠాణీలు – ఒక కప్పు; పచ్చి కోవా – అర కప్పు; ఆనప కాయ తురుము – ఒక కప్పు; పంచదార – ఒక కప్పు; పచ్చికొబ్బరి తురుము – పావు కప్పు; నెయ్యి – 3 టీ స్పూన్లు; పాలు – 5 కప్పులు; జీడిపప్పు + బాదం పప్పులు – గుప్పెడు; ఎండు ద్రాక్ష – 15; ఏలకుల పొడి – చిటికెడు; కర్బూజ గింజలు – టీ స్పూను

తయారీ విధానం :

ముందుగా పచ్చి బఠాణీలను ఒక  గంటసేపు నానబెట్టి, వాటిని ఉడికించి మెత్తగా గ్రైండ్‌ చేసి పక్కన ఉంచాలి. ఇప్పుడు ఆనపకాయ తురుములో కొద్దిగా పాలు జత చేసి కుక్కర్ లో పెట్టి  ఒక విజిల్‌ రాగానే దించేయాలి. మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టి అది వేడయ్యాక నెయ్యి వేయాలి. నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి వేపాలి. ఆ తరువాత  పచ్చి బఠాణీ ముద్ద వేసి పది నిమిషాల పాటు ఆపకుండా కలుపుతుండాలి. తరువాత ఆనపకాయ తురుము జత చేసి ఐదు నిమిషాలు కలిపి ఆ తరవాత కోవా, పాలు, పంచదార వేసి బాగా కలపాలి. ఏలకుల పొడి, డ్రై ఫ్రూట్స్‌ జత చేసి, బాగా కలిపి రెండు నిమిషాలు ఉంచి దించేయాలి. వేడివేడిగా తింటే రుచిగా ఉంటుంది.

పచ్చి బఠాణీ పరోఠా:

కావలసిన పదార్ధాలు :
గోధుమ పిండి – 3 కప్పులు; పచ్చి బఠాణీలు – ఒక కప్పు; పచ్చి మిర్చి ముద్ద – తగినంత; నూనె – తగినంత; కొత్తిమీర, కరివేపాకు – తగినంత; నెయ్యి – టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; ఉప్పు – తగినంత
తయారీ విధానం : ముందుగా పచ్చి బఠాణీలను ఒక గంట సేపు నానబెట్టాలి. తరువాత వాటిని కుక్కర్ లో వేసి పొయ్యి మీద పెట్టి ఒక విజిల్‌ వచ్చాక దించేయాలి. చల్లారాక మెత్తగా గ్రైండ్‌ చేయాలి. ఇప్పుడు ఒక గిన్నెలో గోధుమ పిండిని తీసుకుని అందులో  పచ్చి బఠాణీ ముద్ద జత చేసి,పచ్చి మిర్చి తరుగు, ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, నెయ్యి వేసి బాగా కలిపి కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ  చపాతీ పిండిలా కలిపి, అరగంటసేపు నాననివ్వాలి. తరువాత చిన్న ఉండలు చేసుకుని, చపాతీ మాదిరిగా ఒత్తుకుని పెనం మీద వేసి రెండు వైపులా నూనె వేస్తూ కాల్చాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: