ఈరోజు శ్రావణ శుక్రవారం అలాగే వరలక్ష్మి వ్రతం కూడా ఈరోజే కాబట్టి ప్రతి ఒక్కరి ఇల్లు ఘుమ ఘుమలాడే వంటకాలతో నిండి పోయి ఉంటుంది. అమ్మవారికి నైవేద్యంగా పూర్ణాలు, గారెలు, బూరెలు, పరమాన్నం, పులిహోర, బొబ్బట్లు, చలిమిడి, వడపప్పు, శనగలు వంటివి చేస్తారు.ఇలా తొమ్మిది రకాల వంటలు చేయలేని వాళ్ళు తమకు తోచినన్ని వంటలు చేసుకోవచ్చని కూడా పెద్దలు చెప్తున్నారు. మరి ఈరోజు పూర్ణాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా.
కావలసినవి :
మినపప్పు : కప్పు
బియ్యం : 1 పావుకప్పు
పచ్చనగపప్పు : కప్పు
వంటసోడా : పావు టీస్పూన్
బెల్లం : కప్పు
యాలకులపొడి : అర టీస్పూన్
ఉపు : తగినంత
నూనె : తగినంత
తయారీ :
ముందుగా మినపప్పు, బియ్యాన్ని ఒక ఆరు గంటల పాటు నానబెట్టాలి. అలాగే మరొక గిన్నెలో పచ్చి సెనగపప్పును కూడా నానపెట్టాలి. తర్వాత మినపప్పు, బియ్యాన్ని గ్రైండర్ లో వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి.అందులో సరిపడా ఉప్పు, వంటసోడా కలపాలి. మీరు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి పిండి మరి గట్టిగా కాకుండా ఉండాలి అలాఅని మరి పలుచగా కూడా ఉండకూడదు. తర్వాత నానపెట్టుకున్న పచ్చిశెనగపప్పును కుక్కర్‌లో వేసి కొద్దిగా నీళ్లు పోసి నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి.ఇప్పుడు పప్పు ఉడికిన తరువాత అందులో కొద్దిగా నీళ్లు పోసి బెల్లం చితకొట్టి వేయాలి. అలాగే యాలుకల పొడిని కూడా వేయాలి. పప్పు మెత్తగా అయ్యాక స్మాష్ చేసుకోవాలి.కొద్దిగా నెయ్యి వేస్తే రుచి బాగుంటుంది. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత గుండ్రంగా ఉండలు చేసి పెట్టుకోవాలి. ఈలోపు కడాయిలో నూనె పోసి వేడి చేయండి. గుండ్రగా చుట్టుకున్న పచ్చి శెనగపప్పు బెల్లం ఉండలను ఒక్కొక్కటిగా పిండిలో ముంచి నెమ్మదిగా నూనెలోకి వదలాలి. అవి పైకి తేలిన తరువాత గరిటెతో అటు ఇటు తిప్పండి. పూర్ణాలు బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత నూనెలోంచి తీసేసి ఒక గిన్నెలోకి వేసుకోండి. అంతే వేడివేడి పూర్ణాలు రెడీ అయినట్లే.. !!