అనంతపురం కదిరి పట్టణంలో నాగభూషణం అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. అతడు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతని భార్య ఈశ్వరమ్మ. వీరికి ఇద్దరు పిల్లలు. ఎలాంటి కష్టాలూ లేకుండా ఆనందంగా నడుస్తోంది వారి కాపురం. అయితే ఉన్నట్లుండి ఈ మధ్య ఈశ్వరమ్మకు ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీయడంతో ఆమె తన భర్త అడ్డుగా ఉన్నాడని భావించింది. దీంతో అతడిని చంపేయాలని నిర్ణయించుకుంది.
అనుకున్నట్లుగానే ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది. చంపేసిన తర్వాత మృతదేహాన్ని నిర్మానుష్య ప్రాంతంలో పూడ్చి పెట్టింది. ఆ తరువాత ఏమి ఎరుగనట్లుగా భర్త కనపడడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ మొదలు పెట్టారు. నెల గడిచిపోయినా ఎలాంటి ఆధారమూ లభించలేదు. అయితే సరిగ్గా 54 రోజుల తర్వాత ఆమె చేసిన చిన్న తప్పు కారణంగా పోలీసులకు అడ్డంగా దొరికి పోయింది.
రెండు రోజుల క్రితం ముదిగుబ్బలో గుర్తు తెలియని శవం బయట పడడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఈశ్వరమ్మను మృతదేహాన్ని గుర్తుపడ్తాడానికి పిలిచారు. అక్కడకు వచ్చిన ఆమె అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో పోలీసులకు అనుమానం వచ్చి ఆమె కాల్ డేటాను పరిశీలించి భర్త మరణానికి ముందు ఆమె ఎవరితోనే ఎక్కువసార్లు ఫోన్లో మాట్లాడినట్లు తేలింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో ఈశ్వరమ్మ నిజం ఒప్పుకుంది. ప్రస్తుతం ఈశ్వరమ్మతో పాటు ఆమె ప్రియుడు కూడా ఊచలు లెక్కపెడుతున్నారు.