నేటి సమాజంలో చాల మంది కష్టపడి పని చేయడానికి ఇష్టపడటం లేదు. దోపిడీలకు, మోసాలకు, కిడ్నప్ లకు పాల్పడి డబ్బులు కాజేస్తున్నారు. టెక్నాలజీని వాడుకొని కొంత మంది డబ్బులు సంపాదిస్తున్నారు. తాజాగా నర్సింగ్‌ విద్యార్థిని కిడ్నాప్‌ చేసి రూ.2 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేసిన నలుగురు కిడ్నాపర్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. బాణసవాడి పోలీసులు ఏడు గంటల్లోనే కేసును ఛేదించారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నగరానికి చెందిన రబీజ్‌ అరాఫత్‌ యూకేలో నర్సింగ్‌ లో ఎంఎస్‌ చదువుతున్నాడు. కొద్దికాలంగా అతను బెంగళూరులోనే ఉంటూ ఇంటి నుంచి ఆన్ ‌లైన్‌ క్లాసులు వింటున్నాడు. గురువారం మధ్యాహ్నం రబీజ్‌ మొబైల్ ‌కు ఫోన్‌ రావడంతో తన ద్విచక్ర వాహనంలో బయటకు వెళ్లాడు. ఈ సమయంలో కిడ్నాపర్లు అతడిని కారులో అపహరించుకుని పోయారు. అనంతరం అతని తండ్రికి ఫోన్‌ చేసి కిడ్నాప్‌ సమాచారం ఇచ్చారు.

దీంతో ఆయన కుమారుడి సెల్‌కు ఫోన్‌ చేస్తే స్విచాఫ్‌ వచ్చింది. వెంటనే కేజీ హళ్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డీసీపీ శరణప్ప బాణసవాడి, ఏసీపీ సక్రి నేతృత్వంలో ఐదు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సీసీ కెమెరాల ఆధారంగా జల్లెడ పట్టాయి. ఏడు గంటల్లోనే కిడ్నాపర్లను పోలీసులు అరెస్ట్‌ చేసి యువకుడిని రక్షించారు. అప్పులు తీర్చడానికి నిందితులు అబ్దుల్‌ పహాద్, జబీవుల్లా, సయ్యద్‌సల్మాన్, తౌహిద్‌లు మరికొందరితో కలిసి కిడ్నాప్‌ పథకం వేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇక ఈ తరుణంలో నగరంలో శ్రీమంతుల గురించి ఆరా తీశారు. రబీజ్‌ అరాఫత్‌ వివరాలు సేకరించి కిడ్నాప్‌ చేయడానికి పథకం వేశారు. అంతకు ముందే ఓ కారును కొనుగోలు చేశారు. పథకం ప్రకారం రబీజ్‌ను బయటకు రప్పించి కిడ్నాప్‌ చేశారు. అన్నిదారులు దిగ్బంధం చేయడంతో కిడ్నాపర్లు సులువుగా దొరికిపోయారు. కిడ్నాప్‌ సూత్రధారి అబ్దుల్‌ పహాద్‌పై గతంలో కూడా కేజీహళ్లి పోలీస్‌ స్టేషన్‌లో కిడ్నాప్‌ కేసు నమోదైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: