ప్రస్తుతం పెళ్ళీడు వచ్చినా పెళ్లిళ్లు జరగడం లేదని ఆత్మహత్య చేసుకుంటున్న‌ వారి సంఖ్య పెరిగిపోతుంది. పెళ్లి వయసు వచ్చినా ఉద్యోగం లేదని, అందంగా లేర‌ని, పెళ్ళి వయస్సు దాటి పోయిందని ఇలా ర‌క ర‌కాల కార‌ణాల వల్ల పెళ్లిళ్లు జరగటం లేదు. దాంతో చాలామంది నిరుత్సాహ పడుతున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం పెళ్లి వయసు వచ్చి పెళ్ళిళ్ళు జరగడం లేదని ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో పురుషులు ఎక్కువ మంది ఉన్నారు. అయితే తాజాగా ఓ మహిళా ఎస్సై తనకు పెళ్ళి జరగడం లేదని ఆత్మహత్య చేసుకుంది. అందం, ఉద్యోగం ఉండి కూడా పెళ్లి జరగకపోవడంతో ఎస్సై ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. రత్ లామ్ జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో కవిత సోలంకి అనే మహిళ ఎస్సై విధులు నిర్వహిస్తోంది. ఎంతో కష్టపడి కవితా సోలంకి ఎస్ఐ గా ఉద్యోగం సాధించింది. 

ఒక బాధ్యతాయుతమైన పోలీస్ ఆఫీసర్ గా కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం కవిత సోలంకి వయసు 35 సంవత్సరాలు. దాంతో ప్రతి ఒక్కరూ ఆమెను పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నిస్తున్నారు. పెళ్లి ఈడుకు వచ్చావ్ ఇంకా ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అంటూ చుట్టుపక్కల వాళ్ళు అడుగుతున్నారు. ఇక మరికొందరు సూటిపోటి మాటలతో దెప్పి పొడుస్తున్నారు. దాంతో మహిళా ఎస్సై తీవ్ర ఆవేదనకు గురైంది. ఇక ఇటీవల స్వగ్రామానికి వెళ్లిన సమయంలోనూ కవిత సోలంకికి అలాంటి ప్రశ్నలే ఎదురయ్యాయి. దాంతో తీవ్ర ఆవేదన చెందింది. ఇంటి నుండి తిరిగి వచ్చి డ్యూటీలో జాయిన్ అయింది.

కాగా బుధవారం రాత్రి తీవ్ర మనోవేదనకు గురైన కవిత విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. అనంతరం తన స్నేహితురాలికి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పింది. దాంతో ఆమె స్నేహితురాలు ఘటనాస్థలానికి చేరుకుని కవితని ఆస్పత్రికి తీసుకెళ్ళింది. కానీ చికిత్స పొందుతూ గురువారం పరిస్థితి విషమించడంతో ఎస్సై క‌విత తుది శ్వాస విడిచింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరపగా కవిత ఇంటి వద్ద ఒక సూసైడ్ నోట్ ల‌భించింది. అందులో తనకు పెళ్లి కావడం లేదని ఆందోళన చెందినట్టు... పెళ్లిపై ఇరుగుపొరుగువారి మాటలకు సమాధానం చెప్పలేక అలసిపోయి ఆత్మహత్య చేసుకుంటున్నా అంటూ పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: