గుంటూరు గవర్నర్‌మెంట్‌ జనరల్‌ ఆసుపత్రిలో కలకలం రేపిన కిడ్నాప్‌ కేసును పోలీసులు త్వరితగతిన ఛేదించారు. అపహరణకు గురైన నాలుగు రోజుల పసికందును తల్లి ఒడికి చేర్చారు పోలీసులు. దీంతో కిడ్నాప్‌ కథ సుఖాంతం అయింది. అయితే శిశువుని అపహరించిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో నివ్వెరపోయే విషయం వెల్లడైంది. ఈ అపహరణ ఆ కుటుంబంపై కక్షతో కాకుండా.. ఆసుపత్రిపై కోపం, అక్కసుతో చేసినట్లుగా పోలీసుల విచారణలో తేలడం చర్చనీయాంశంగా మారింది.

గుంటూరు జిల్లాలోని కాకానికి చెందిన ప్రియాంక ఈనెల 13న మగబిడ్డను ప్రసవించింది. తల్లీబిడ్డ బాగోగులు చూసుకునేందుకు ప్రియాంక తల్లి, అత్తమ్మలు ఆసుపత్రిలోనే ఉన్నారు. ఈ క్రమంలో వారు కాన్పుల వార్డు నుంచి నాలుగు రోజుల పసికందును వరండాలోకి తీసుకొచ్చి కింద పడుకోబెట్టారు. ఇదే సమయంలో బిడ్డ పక్కనే పడుకుని కాసేపు కునుకు తీశారు. బిడ్డ తల్లి ప్రియాంక కూడా ఆ సమయంలో బాత్‌రూమ్‌కు వెళ్లింది. తిరిగి బయటకు వచ్చిన ఆమెకు.. తన తల్లి, అత్తమ్మల పక్కన పసిబిడ్డ లేకపోవడం చూసి వారిద్దరిని లేపింది. పక్కన పడుకోబెట్టుకున్న బాబు కనిపించక పోయేసరికి బాధిత కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన ఫుటేజ్‌ను పరిశీలించారు. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు, ఆనవాళ్ల ఆధారంగా పోలీసులు గాలించారు. చివరకు నిందితులను నెహ్రునగర్‌లో అదుపులోకి తీసుకున్నారు. తొలుత వారి నుంచి బిడ్డను తీసుకుని నేరుగా ఆసుపత్రికి వచ్చారు. అక్కడ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ సమక్షంలో బిడ్డను తల్లిదండ్రులకు అప్పగించారు. అనంతరం ఇద్దరు నిందితులను పూర్తిస్థాయిలో విచారించారు.

నగరంలోని నెహ్రునగర్‌ చెందిన హేమ వరుణుడు, పద్మజలు.. గతంలో ఇదే ప్రభుత్వాసుపత్రిలో కాంట్రాక్టు సిబ్బందిగా పనిచేసేవారు. అయితే వీరిద్దరిని ఆసుపత్రి అధికారులు తొలగించారు. దీన్ని మనసులో పెట్టుకున్న హేమ వరుణుడు, పద్మజలు.. తమ అక్కసును అపహరణ రూపంలో తీర్చుకోవడానికి ప్రయత్నించామని పోలీసుల విచారణలో వెల్లడించారు. ఇది విని పోలీసులు విస్తుపోయారు. నిందితులపై కేసు నమోదు చేశారు.

మరోవైపు అపహరణకు గురైన బిడ్డ తిరిగి కనిపించడంతో తల్లి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కాకానికి చెందిన ప్రియాంక రెండో కాన్పులో మగబిడ్డకు జన్మనిచ్చింది. తొలి కాన్పులో పుట్టిన శిశువు పురిటిలోనే కన్నుమూసింది. ఆ తర్వాత ఆరేళ్లకు రెండో కాన్పులో మగ శిశువుకు జన్మనిచ్చింది. శిశువును కళ్లారా చూసుకోక ముందే అపహరణకు గురికావడంతో.. కన్నతల్లి హృదయం తల్లడిల్లిపోయింది. కన్నీరుమున్నీరు అయింది. ఈ క్రమంలో కిడ్నాప్‌నకు గురైన బిడ్డను తిరిగి తల్లి ఒడికి చేర్చిన పోలీసులకు బంధువులు చేతులెత్తి మొక్కారు.  కేసును త్వరితగతిన ఛేదించి, బిడ్డను తల్లిఒడికి చేర్చిన పోలీసులకు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ కృతజ్ఞతలు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: