భారతదేశంలో కూతురు-అల్లుడితో కలిసి అత్తలు జీవించడం సర్వసాధారణమని, కొద్ది మంది ముసలితనంలో పోషణ నిమిత్తం అల్లుడిపైనే ఆధారపడుతుంటారని, అంతమాత్రాన అల్లునికి అత్త చట్టబద్దమైన వారసురాలు కాబోదన్నది కోర్టు. అయితే ప్రత్యేక సందర్భాలలో మాత్రం అత్త తప్పకుండా అల్లునికి చట్టబద్ద ప్రతినిధి అవుతారని చెప్పింది. ముఖ్యంగా అల్లుడ మరణించిన సందర్భంలో ఆమె బీమా పొందడానికి అర్హురాలు అవుతుందని, మోటార్ వాహనాల చట్టం సెక్షన్ 166 ప్రకారం అత్తగారు అల్లునికి చట్టబద్దమైన ప్రతినిధి అవుతుందని సుప్రీంకోర్టు వెల్లడించింది. చనిపోయిన అల్లుడి బీమా పొందే హక్కు అత్తకు లేదని.. గతంలో కేరళ హై కోర్టు ఇచ్చిన తీర్పును సైతం సుప్రీంకోర్టు కొట్టివేసింది.
సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పిన అత్తా అల్లుళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. కేరళకు చెందిన ఎన్.వేణుగోపాలన్ నాయర్ అనే ప్రొఫెసర్ 2011లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు. దీంతో ఆయన కుటుంబానికి రూ.74,50,071 పరిహారం చెల్లించాలని మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రిబ్యునల్ ఆదేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ బీమా కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు ఆ పరిహారాన్ని రూ.48,39,728కి తగ్గించింది. అదేవిధంగా అత్తను చట్టబద్ద ప్రతినిధిగా పరిగణించలేమని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. మృతుని భార్య సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తూ నెలకు రూ.83,831 వేతనం తీసుకుంటున్న విషయాన్ని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకున్నది. అతడు 52 ఏళ్లకు మరణించడంతో కుటుంబం తీవ్రంగా నష్టం పోయిందని.. రూ.85,81,815 పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. దీంతో అది సంచలన తీర్పుగా మారింది.