మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించినది. సోమవారం రాత్రి కమలా నెహ్రూ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగి నలుగురు చిన్నారులు సజీవదహనమయ్యారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా పీడియాట్రిక్స్ వార్డులో మంటలు చెలరేగి ప్రమాదం చోటుచేసుకున్నది. ఈ ఘటన చోటు చేసుకున్న సమయంలో ఆ వార్డులో 40 మంది చిన్నారులు ఉన్నారు. వీరిలో నలుగురు చిన్నారులు అగ్నికి ఆహుతి అయ్యారు. మిగతా 36 మంది చిన్నారులు సురక్షితంగా బయటపడ్డారు.
ఆసుపత్రిలో మంటలు చెలరేగిన విషయాన్ని గమనించిన చిన్నారుల తల్లిదండ్రులు ఆ పసిపాపలను తీసుకొని ఆసుపత్రి నుంచి బయటకు పరుగులు తీసారు. కమలా నెహ్రూ ఆసుపత్రిలోని వార్డులో మంటలు చెలరేగడంతో పాటు పొగంతా కమ్ముకోవడంతో చిన్నారులు, పెద్దలు ఆస్పత్రిలో ఉక్కిరికిభిక్కిరి అయ్యారు. లోపలే ఉన్న చిన్నారుల పరిస్థితి గురించి తెలియక వారి తల్లిదండ్రులు అర్థరాత్రి వరకు బయటనే పడిగాపులు కాసారు. ఈఘటనలో అస్వస్థతకు గురైన కొంత మంది చిన్నారులను హుటాహుటిన మరొక వార్డుకు తరలించినట్టు అధికారులు వెల్లడించారు. అప్పటి వరకు బాగానే ఉన్న ఒక్కసారిగా షార్ట్ సర్య్కూట్ కారణంగా మంటలు చెలరేగడంతో నలుగురు చిన్నారులు సజీవదహనం కావడంతో వారి తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ అగ్నిప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.