బావ, బామ్మ‌ర్ది ఇద్ద‌రు క‌లిసి వంద‌లాది మంది ర‌త్నాక‌ర్ బ్యాంక్ లిమిటెడ్ క్రెడిట్ కార్డు దారుల‌కు ఫోన్ చేసి మోస‌గించి దాదాపు రూ.3కోట్లు కొల్ల‌గొట్టారు. సైబ‌ర్‌బాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ ఎం.స్టీఫెన్ ర‌వీంద్ర విలేక‌ర్ల స‌మావేశంలో వివ‌రాల‌ను వెల్ల‌డించారు. దేశ రాజ‌ధాని ఢిల్లీ న‌గ‌రంలోని ఉత్త‌మ్‌న‌గ‌ర్ లో ఉంటున్న దీప‌క్ చౌద‌రి సంవ‌త్స‌రం కాలం నుంచి ఓ కాల్ సెంట‌ర్‌ను నిర్వ‌హిస్తున్నాడు. రుణాలు ఇప్పిస్తానని ప‌లు మోసాల‌కు పాల్ప‌డ్డాడు.  మోసానికి పాల్ప‌డుతున్నాడ‌నే  విష‌యాన్ని దీప‌క్ బావ, ఆర్‌బీఎల్ బ్యాంకు అధికారి భాటియా   గుర్తించాడు. త‌న బ్యాంకులోని ల‌క్ష‌ల మంది  క్రెడిట్ కార్డు దారుల‌కు స‌మాచారం చేర‌వేస్తాన‌ని, మ‌న ఇద్ద‌రం క‌లిసి ప‌లు మోసాల‌కు పాల్ప‌డుదాం అంటూ ప్ర‌తిపాదించాడు.

దీనికి అంగీక‌రించిన దీప‌క్ చౌద‌రి 6 నెల‌ల క్రితం ఢిల్లీలోని వేర్వేరు ప్రాంతాల‌లో, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌ల‌లోని హోట‌ళ్ల‌లో కాల్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేశాడు. భారీ ఎత్తున టెలికాల‌ర్ల‌ను నియ‌మించి, వారు ఆర్‌బీఐ వినియోగ‌దారుల అధికారుల పేర్ల‌తో ఆర్‌బీఎల్‌ క్రెడిట్ కార్డుదారుల‌కు ఫోన్లు చేయ‌డం మొద‌లుపెట్టారు. రుణ‌ప‌రిమితిని పెంచుతామ‌ని, బీమా సౌక‌ర్యం క‌ల్పిస్తాం, కార్డు అప్‌డేట్ చేసుకోవాల‌ని అంటూ ప్ర‌తిపాదించేవారు. స్పూఫింగ్ ప‌రిజ్ఞానంతో ఆర్‌బీఎల్ బ్యాంకు వినియోగ‌దారుల సేవా కేంద్రం ఫోన్ నెంబ‌ర్ బాధితుల ఫోన్ల‌లో కనిపిస్తుండ‌డంతో టెలీకాల‌ర్లు చెప్పిన మాట‌ల‌ను వంద‌లాది మంది న‌మ్మారు.

కోడ్ నెంబ‌ర్ వ‌స్తుంద‌ని చెప్ప‌గానే ఓటీపీలు చెప్పేశారు. ఈ మొత్తాన్ని త‌మ ఖాతాలో వేసుకుంటే పోలీసుల‌కు దొరికిపోతాం అని అంచెనా వేసి సొంత ఈ- కామ‌ర్స్ సైట్‌ల‌ను సృష్టించారు. దీంతో బాధితులు ఆ వెబ్‌సైట్‌లో వ‌స్తువులు, దుస్తులు, ప‌రిక‌రాలు, యంత్రాలు కొన్న‌ట్టు చూపించారు.  నిందితులు విశాల్‌కుమార్‌, క్రిష‌న్‌, క‌ర‌ణ్‌, గౌర‌వ్‌, దుర్గేష్‌, ప్ర‌త్యేక సాప్ట్‌వేర్ త‌యారు చేశారు. బాధితుల నుంచి కొట్టేసిన న‌గ‌దును తీసుకునేందుకు న‌కిలీ ఆధార్‌, ఓట‌ర్ కార్డు, పాన్‌కార్డుల‌ను సేక‌రించుకున్నారు. వీటి ఆధారంగా సిమ్ కార్డుల‌ను తీసుకుని ఢిల్లీలోని వేరు వేరు బ్యాంకుల‌లో ఖాతాల‌ను తెరిచారు. సొంత ఈ-కామ‌ర్స్ సైట్‌ల‌లో న‌గ‌దును బ్యాంకు ఖాతాల్లో జ‌మ చేసి ఎప్ప‌టిక‌ప్పుడు డ‌బ్బును విత్ డ్రా చేసుకుంటున్నారు.

దేశ‌వ్యాప్తంగా ఈ మోసాల‌పై 134 కేసులు, హైద‌రాబాద్ న‌గ‌రంలోనే 34 కేసులు న‌మోదు అయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో కేసు ద‌ర్యాప్తు చేప‌ట్టిన   సైబ‌రాబాద్ సైబ‌ర్ క్రైమ్ పోలీసులు మూడు రోజుల క్రితం ఢిల్లీలోని ఉత్త‌మ్‌న‌గ‌ర్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఉజ్జ‌యిని న‌గ‌రంలో ఉన్న ఓ హోట‌ల్ కాల్ సెంట‌ర్ వ‌ద్ద దాడులు చేప‌ట్టారు. 16 మందిని అదుపులోకి తీసుకుని, వారి వ‌ద్ద నుంచి 3 కార్లు, 1 బైకు, 865 న‌కిలీ ఓట‌ర్‌, ఆధార్‌, పాన్‌కార్డులు, దాదాపు 1000 సిమ్ కార్డుల‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్ర‌ధాన సూత్రదారుడు, ఆర్బీఎల్ బ్యాంక్ అధికారితో స‌హా మ‌రో ఆరుగురు నిందితులు ప‌రారీలో ఉన్నార‌ని స్వీఫెన్ ర‌వీంద్ర వెల్ల‌డించారు. అదేవిధంగా వీరి బ్యాంకు ఖాతాల‌లోని రూ.15 ల‌క్ష‌లు స్థ‌బింప‌జేశాం అని నేర ప‌రిశోధ‌న డీసీపీ రోహిణి ప్రియ‌ద‌ర్శిని వివ‌రించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: