హైదరాబాద్ లో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గరిమెళ్ల ప్రత్యూష ఆత్మహత్య సంచలనంగా మారింది. బంజారాహిల్స్ లోని ఆమె నివాసంలోనే ఆత్మహత్యకు పాల్పడడం మరింత కలకలం రేపింది. అందులోనూ ఆత్మహత్య చేసుకున్న విధానం కూడా ఆలోచింపజేసే విధంగా ఉంది. కార్బన్ మోనాక్సైడ్ ని పీల్చి ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు అంచనాకు వచ్చారు. కానీ కారణాలు మాత్రం తెలియడంలేదు.

టాలీవుడ్ తోపాటు, బాలీవుడ్ లో కూడా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గా ప్రత్యూషకు పేరుంది. ప్రముఖ హీరోయిన్లకు ఆమె డిజైనర్ గా పనిచేశారు. దేశంలో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లలో టాప్ -30లో ప్రత్యూష కూడా ఒకరు. అయితే ఆమె ఆత్మహత్యకు పాల్పడే కారణం ఏమై ఉంటుందా అనే అనుమానాలు అంతు చిక్కకుండా మారాయి. పోలీసులు కుటుంబ సభ్యుల వద్ద వివరాలు సేకరిస్తున్నారు. ఆమె నివశిస్తున్న ఇంటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రత్యూష ఫోన్ కాంటాక్ట్స్, కాల్ హిస్టరీ ఈ కేసులో కీలక ఆధారాలుగా ఉంటాయని చెబుతున్నారు.

ఆత్మహత్యకు ముందు ప్రత్యూష ఓ సూసైడ్ నోట్ రాసినట్టు తెలుస్తోంది. ఆ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు, దానిపై లోతుగా విచారణ చేపట్టారు. ‘‘నేను కోరుకున్న జీవితం ఇది కాదు. ఒంటరి జీవితంతో విరక్తి చెందా.. ఇకపై తల్లిదండ్రులకు భారం కాలేను. అందరూ నన్ను క్షమించండి’’ అంటూ ప్రత్యూష సూసైడ్ నోట్ రాసినట్టు తెలుస్తోంది.

వాచ్ మెన్ వాంగ్మూలం..
ప్రత్యూష మధ్యాహ్నం అయినా ఇంటినుంచి బయటకు రాకపోవడంతో అనుమానంతో లోపలికి వెళ్లి చూశానని చెబుతున్నారు ఆమె ఇంటి వాచ్ మెన్. అతడిని పోలీసులు విచారణకు పిలిపించారు. ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూషకు ఆర్థిక ఇబ్బందులు లేవని చెబుతున్నారు. మరి ఒంటరితనంతో ఆమె బాధపడ్డారా, డిప్రెషన్ లోకి వెళ్లారా, లేక ఇతరత్రా ఇంకేమైనా సమస్యలున్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.ఇప్పటి వరకూ ఆమె ఆత్మహత్యకు సంబంధించి ఎలాంటి సమాచారం కూడా బయటకు రాలేదు, కేవలం సూసైడ్ నోట్ మాత్రమే బయటకొచ్చింది. అందులో కూడా కారణం లేదు. దీంతో పోలీసులు ఈ కేసుని ఛాలెంజింగ్ గా తీసుకున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: