అవును, నానాటికీ మహిళలపై అరాచకాలు ఎక్కువైపోతున్నాయి. ఈ క్రమంలోనే వరకట్నం వేధింపులు తాళలేక 2016, ఏప్రిల్ 28న ఉపాధ్యాయురాలు మీనాక్షి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనకి సంబందించిన వార్తను వినే వుంటారు. కాగా ఇందుకు కారణమైన భర్త రాజును ఎమ్మిగనూరు పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే, మీనాక్షి, గొల్ల రాజు 2015లో ప్రేమ వివాహం చేసుకున్నారు. మొదట బాగానే వున్న గొల్ల రాజు కొన్నాళ్ల తర్వాత రాజు మీనాక్షిని కట్నం తీసుకురావాలని వేధింపులకు గురి చేశాడు.
అదే తంతు వారి ఇంట్లో ప్రతిరోజూ నడుస్తుండడం వలన ఆ వేధింపులు తాళలేక మీనాక్షి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. దాంతో భర్తపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయింది. ఈ కేసులో మీనాక్షి మరణానికి కారణమైన భర్తకు తాజాగా పదేళ్ల జైలు శిక్ష విధించడం జరిగిందని కుటుంబ సభ్యులు ఓ మీడియా వేదికగా తెలియజేశారు. ఇలాంటి దారుణాలు మనం రోజూ వినడం మన దౌర్భాగ్యం. ఇలాంటి మరో ఘటనే కొన్నాళ్లక్రితం వెలుగు చూసింది. భార్య ఆత్మహత్యకు ప్రేరేపించిన భర్తకు పదేళ్ల జైలు శిక్ష విధించిన ఘటన కేరళలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆత్మహత్య చేసుకునేవిధంగా భార్యను ప్రేరేపించినందుకుగాను భర్త ఎస్. కిరణ్‌కుమార్ (31)కు పదేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు కేరళలోని కొల్లాం అడిషనల్ సెషన్స్ కోర్టు తీర్పు చెప్పింది. వరకట్న నిరోధక చట్టం కింద ఈ శిక్ష విధిస్తున్నట్లు జస్టిస్ కేఎన్ సుజిత్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రకటించింది.
విషయం ఏమిటంటే మెడికల్ విద్యార్థిని విస్మయ 2021 జూన్‌లో పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత ఆమెను వరకట్నం కోసం తీవ్రంగా వేధించినట్లు.. ఆమెను ఆత్మహత్య చేసుకునేవిధంగా ప్రేరేపించినట్లు ప్రాసిక్యూషన్ చాలా తీవ్రంగా ఆరోపించింది. దీనికి భారత శిక్షాసృతి వరకట్న నిషేధ చట్టం ప్రకారం శిక్ష వేసినట్లు జిల్లా సెషన్స్ జడ్జి -1 సుజిత్ కేఎన్ తీర్పు చెప్పారు. విస్మయ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు చూస్తే, 100 సవరల బంగారం, ఒక ఎకరా విస్తీర్ణంగల భూమి వరకట్నంగా కిరణ్‌కు ఇచ్చారు. వీటితోపాటు రూ.10 లక్షల విలువైన ఓ కారును కూడా ఇచ్చారు. అయితే దాంతో మొదట సంతృప్తి చెందినట్టు నటించినట్టు కిరణ్ వివాహం అయ్యాక తన భార్యపై నిజ స్వరూపం చూపించాడు. ఈ క్రమంలోనే ఆమె ఆత్మహత్య చేసుకుంది.