ఇలా ఈ మధ్యకాలంలో ఏకంగా కోతులు తరచుగా దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో.. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కూడా ఇండియాలో చాలానే వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇక ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ లోని హత్రాస్ లో కూడా ఇలాంటి ఘటన జరిగింది. ఏకంగా ఇద్దరు అక్కాచెల్లెళ్లపై కోతులు దాడికి దిగాయి. ఈ క్రమంలోనే ప్రాణాలను కాపాడుకునేందుకు వాళ్లు పారిపోతూ ఉండగా.. బావిలో పడిపోయారు. చివరికి ఈ ఘటనలో ఒకరు ప్రాణం పోయింది. కోత్వాల్ సదర్ ప్రాంతానికి చెందిన మొహల్లా నైకా నాకాల నివాసి శివకుమార్ ఆటో నడుపుతూ కుటుంబం పోషిస్తున్నాడు. ఇక అతనికి 19 ఏళ్ల స్వప్న, 15 ఏళ్ల సాధన అని ఇద్దరు కూతుర్లు ఉన్నారు.
అయితే ఇటీవల వారు బయట నిలబడిన సమయంలో కోతులు ఒక్కసారిగా దాడి చేశాయి. దీంతో వాటి నుంచి తప్పించుకునేందుకు హడావిడిగా పరుగులు పెట్టడంతో. ఇంటి పక్కనే ఉన్న బావిలో పడిపోయారు. స్థానికులు ఎంతో శ్రమించి ఇద్దరు అక్క చెల్లెళ్లను బావిలో నుంచి బయటికి తీశారు. పెద్ద కూతురు స్వప్న మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అయితే గాయాల పాలైన రెండో కూతురికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అయితే కోతుల బెడదతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు అందరూ కూడా కోరుతున్నారు.