
వివరాల్లోకి వెళ్తే.. గజ్జల వారి చెరువు దగ్గర జ్యూస్ అమ్ముకుంటూ బతుకుతున్న శివ నాగసాయి కృష్ణ అనే యువకుడికి గత నెల 31న వైభవంగా వివాహం జరిగింది. విశాఖపట్నం కంచరపాలెం నుంచి చంద్రహాసిని అనే అమ్మాయిని అంగరంగ వైభవంగా పెళ్లాడాడు. అంతా సవ్యంగానే ఉంది అనుకుంటున్న సమయంలో అసలు కథ మొదలైంది. అత్తారింటి నుంచి ఏలూరుకు వచ్చిన వారం రోజుల్లోనే కొత్త కాపురం పెట్టారు. బిట్టుబారు దగ్గర అద్దె ఇంట్లో సంసారం మొదలుపెట్టారు.
కాళ్ల పారాణి ఆరకముందే, కాపురం మొదలుపెట్టిన కొద్ది రోజులకే నవ వధువు అసలు రంగు బయటపెట్టింది. భర్త గాఢ నిద్రలో ఉండగా, ఇంట్లో బీరువాలో దాచిన నాలుగు కాసుల బంగారు గొలుసు, ఉంగరం, వెండి పట్టీలు, సెల్‌ఫోన్ మొత్తం తీసుకుని సైలెంట్‌గా జారుకుంది. ఉదయం లేచి చూసేసరికి శివకు దిమ్మతిరిగిపోయింది. ఇంట్లో పెళ్ళాం లేదు.. ఆమె మాయం అయ్యిందనే బాధలో ఉంటూ ఉండగా అతడికి మరో షాక్ తగిలింది. అది ఏంటంటే నగలు లేవు.. ఫోను లేదు. మోసపోయానని గ్రహించిన శివ లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు.
వెంటనే తేరుకున్న శివ చంద్రహాసిని కోసం ఆమె తండ్రితో కలిసి గాలించాడు. ఎక్కడా ఆచూకీ లేదు. చివరికి విసిగి వేసారి ఏలూరు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇలా పెళ్లి పేరుతో మోసాలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. అపరిచిత వ్యక్తులను గుడ్డిగా నమ్మి పెళ్లి చేసుకుంటే ఇలాంటి ఘోరాలు జరుగుతాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరి ఈ మాయ లేడి ఎక్కడికి పారిపోయిందో, ఏం చేస్తుందో చూడాలి.