
వరంగల్ నగరంలో ఇటీవల తీవ్ర కలకలం రేపిన డాక్టర్ పై హత్యాయత్నం కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. దాడి వెనుక వైద్యుడు భార్యతో పాటు ఆమె ప్రియుడు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ వివరాలను ఏసిపి నందిరాం నాయక్ వెల్లడించారు. వరంగల్ హంటర్ రోడ్డు లోని వాసవి కాలనీలో డాక్టర్ సుమంత్ రెడ్డి నివాసం ఉండేవారు. ఆయనకు 2016లో ఫ్లోరా మరియతో ప్రేమ వివాహం అయింది. ఈ క్రమంలోనే తన బంధువుల విద్యాసంస్థలను చూసుకునేందుకు 2018 లో సుమంత్ రెడ్డి తన భార్యతో పాటు సంగారెడ్డికి మఖాం మార్చారు. అక్కడ ఫ్లోరా ఉపాధ్యాయురాలుగా సుమంత్ రెడ్డి పిహెచ్‌సీ లో కాంట్రాక్టు మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. సంగారెడ్డిలో జిమ్ కు వెళుతున్న క్రమంలో ఫ్లోరాకు శిక్షకుడు సామ్యూల్ తో పరిచయం ఏర్పడి అధికాస్తా వివాహేతర సంబందానికి దారితీసింది. ఈ విషయం భర్తకు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగి మళ్ళీ వరంగల్ కు మకాం మార్చారు. ఆమెకు 2019లో జనగామ జిల్లా పెంబర్తి సోషల్ వెల్ఫేర్ కళాశాలలో టీచర్గా ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత కళాశాలను రంగసాయిపేటకు మార్చారు. అయినా ఫ్లోరా ప్రవర్తనలో మార్పు రాలేదు.
భర్త లేని సమయంలో శామ్యూల్ని ఇంటికి పిలిచి అతనితో వివాహేతర సంబంధం కొనసాగించేది. ఈ విషయంపై మళ్ళీ భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. దీంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని ఫ్లోరా ఆమె ప్రియుడు నిర్ణయించుకున్నారు. ఇందుకు ఫ్లోరా లక్ష ఆన్లైన్లో శామ్యూల్ కు పంపింది. ఇందులో 50,000 శామ్యూల్ సైబరాబాద్ లో ఏ ఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న తన స్నేహితుడైన రాజకుమార్‌కు ఇచ్చాడు. వైద్యుడిని చంపితే ఇల్లు కట్టిస్తానని రాజ్ కుమార్ తో ఒప్పందం చేసుకున్నారు. పన్నాగంలో భాగంగా ఈనెల 20న రాత్రి వారిద్దరు హెల్మెట్ ధరించి బైక్ పై వరంగల్ కు చేరుకున్నారు. కాజీపేటలో ప్రైవేట్ ఆస్పత్రి నడుపుతున్న సుమంత్ రెడ్డి రాత్రి విధులు మిగించుకుని కారులో ఇంటికి వస్తుండగా కారు వెనక భాగంలో సుత్తితో కొట్టారు.
శబ్దం మిన్న సుమంత్ రెడ్డి కారును ఆపి బయటకు వచ్చి చూస్తుండగా అదే సుత్తితో పలుమార్లు అతడు తలపై గట్టిగా కొట్టారు.. అతడు చనిపోయాడు అనుకుని పారిపోయారు. తీవ్ర రక్తస్రావం అయిన వైద్యుడిని స్థానికులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి హైదరాబాద్కు తీసుకువెళ్లారు.. ప్రస్తుతం అతడి పరిస్థితి అత్యంత విషమంగా ఉండడంతో తిరిగి వరంగల్ కు తీసుకువచ్చారు. ఈ ఘటనపై బాధితుడు తండ్రి సుధాకర్ రెడ్డి పిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సిసి ఫుటేజీ పరిశీలించి నిందితులను గుర్తించారు. ఇంట్లోని బంగారం అమ్మేందుకు వెళుతున్న శామ్యూల్ - రాజ్కుమార్ తో పాటు భార్య ఫ్లోరా మరియాలను అరెస్టు చేశారు. ఇలా ఆ కిలేడీ బండారం బయటపడింది.