
ప్రేమించిన వాడిపై పగతో రగిలిపోయిన ఓ యువతి చేసిన పని ఇది. మూడేళ్లు ప్రేమించుకుని, పెళ్లి చేసుకుంటాడని కలలు కన్న ఆ యువతికి రెండేళ్ల క్రితం ఊహించని షాక్ తగిలింది. ఆమె ప్రియుడు మరో అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వేశాడు. అప్పటినుంచి రగిలిపోతున్న పగ జ్వాలలు ఈ నెల 29న దావానలంగా మారాయి.
బర్మా క్యాంపుకు చెందిన 27 ఏళ్ల ఆ యువతి, విశ్వనాథం రోడ్డులో ఉంటున్న తన మాజీ ప్రియుడి అపార్ట్‌మెంట్‌కు అర్ధరాత్రి వేళ చేరుకుంది. ఎవరూ చూడకుండా సెల్లార్‌లోకి జొరబడి, అక్కడున్న అతని బైక్‌కు నిప్పు పెట్టింది. ఆ మంటలు క్షణాల్లో వ్యాపించాయి. పక్కనే పార్క్ చేసిన మరో 13 వాహనాలు కూడా కాలి బూడిదయ్యాయి. భవనం ముందున్న మరో నాలుగు బైకులు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఒక ఫ్లాట్‌లోని సామాన్లు కూడా అగ్నికి ఆహుతయ్యాయి.
మొదట ఇది సాధారణ ప్రమాదంగా అందరూ భావించారు. కానీ సీసీ కెమెరాలు అసలు నిజాన్ని బయటపెట్టాయి. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఆ యువతిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆమె అసలు విషయం చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు. ప్రేమించిన వాడిపై పగతో ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టిందా అని ఆశ్చర్యపోయారు. నిందితురాలిని రిమాండ్‌కు తరలించారు టౌన్ సీఐ. ఈ ఘటన విశాఖలో సంచలనం రేపింది. ప్రేమ పేరుతో జరిగే ఇలాంటి ప్రతీకార దాడులు సమాజానికి ప్రమాదకర సంకేతాలు పంపుతున్నాయి. ఇలాంటి వాటికి ఇప్పటికైనా పుల్ స్టాప్ పెట్టకపోతే అందరికీ ప్రమాదమే.