ఈ దేశంలో `చ‌ట్టం` త‌న‌ ప‌ని తాను చేస్తోందా?  అతి పెద్ద ప్ర‌జాస్వామ్య దేశంలో చ‌ట్టం అనే మాట అమ‌లుకు నోచుకుంటోందా?.. కొన్ని ద‌శాబ్దాలుగా ఈ ప్ర‌శ్న‌లు మేధావుల‌నే కాదు.. సామాన్యుల‌ను కూడా తొలిచేస్తు న్నాయి. అప్పుడెప్పుడో.. ప్ర‌ధానిగా ఉన్న స‌మ‌యంలో పీవీ న‌ర‌సింహారావు నోటి నుంచి ``చ‌ట్టం త‌న ప‌ని తాను చేస్తుంది!`` అనే మాట వ‌చ్చింది! అప్ప‌టి నుంచి ఏ విష‌యాన్ని క‌దిలించినా.. నేత‌ల నుంచి, అధి కారుల నుంచి కూడా చ‌ట్టం త‌న‌ప‌నితాను చేస్తుంద‌నే మాట‌లే వినిపిస్తున్నాయి. కానీ, జ‌రుగుతున్న ప‌రి ణామాల‌కు.. చ‌ట్టం చేయాల్సిన ప‌నికి మ‌ధ్య తీవ్ర‌మైన వైరుధ్యం స్ప‌ష్టంగా క‌నిపిస్తుండ‌డంతో.. ఎప్పటి క‌ప్పుడు.. ``చ‌ట్టాన్ని.. త‌న‌ప‌ని తాను చేయ‌నిస్తున్నామా?!`` అనే సందేహం ప్ర‌తి ఒక్క‌రి నుంచి వినిపిస్తూ నే  ఉంది. ఇప్పుడు మ‌రోసారి జ‌నం చెవుల్లో చిన్న‌మాట‌గా ప్ర‌తిధ్వ‌నిస్తూనే ఉంది!


వ‌రుస‌గా ఈ దేశంలో జ‌రుగుతున్న ప‌రిణామాలు.. చ‌ట్టాన్ని-చ‌ట్టం అమ‌లును కూడా ప్ర‌శ్నార్థంగా మారుస్తు న్నాయి. తెలంగాణ‌లో జ‌రిగిన ఘ‌ట‌న‌ను ప్ర‌స్తావించుకుంటే.. గ‌త ఏడాది న‌వంబ‌రులో `దిశ` అనే వెట‌ర్న ‌రీ మ‌హిళా డాక్ట‌ర్‌పై శంషాబాద్ వ‌ద్ద‌ న‌లుగురు యువ‌కులు అత్యంత పాశ‌వికంగా అత్యాచారం చేసి.. త ర్వాత ప్రాణాలు తీసి ఘోరానికి పాల్ప‌డ్డారు. చ‌ట్ట ప్ర‌కారం.. ఇది అత్యంత ఘోర‌మైన నేరం. క‌నుక నింది తులను చ‌ట్ట ప్ర‌కారం శిక్షించాల్సిందే. ఎంత క‌ఠిన శిక్ష ఉంటే.. అంత క‌ఠిన శిక్షా విధించాల్సిందే. అయి తే, అది చ‌ట్ట ప్ర‌కారం సాగాలి! అయితే, ఆ సాగ‌నిచ్చామా?  నిందితులు న‌లుగురిని పోలీసులు బంధించ ‌డ‌మైతే.. బంధించారు కానీ.. చ‌ట్ట ప్ర‌కారం జ‌ర‌గాల్సిన క్ర‌తువు.. చ‌ట్ట విహితంగా సాగిపోయింది. అర్ధ‌రాత్రి వేళ సీన్ రీక్రియేట్ చేయిస్తున్నామ‌ని.. ఈ క్ర‌మంలో వారి పాపోయేందుకు ప్ర‌య‌త్నిస్తే.. ఎన్‌కౌంట‌ర్ చేశా మ‌ని పోలీసులు చెప్పుకొచ్చారు. 

 

ఈ ఎన్‌కౌంట‌ర్‌ను స‌మ‌ర్దించుకునేందుకు పోలీసులు చెప్పిన మాట‌లు వినేందుకు బాగున్నాయేమో కానీ.. చ‌ట్ట ప్ర‌కారం చూస్తే.. నిర్ద్వంద్వంగా చ‌ట్ట వ్య‌తిరేక‌మే! న‌లుగురు నిందితుల‌ను అర్ధ‌రాత్రి పూట‌.. ఎలాంటి ర‌క్ష‌ణ లేకుండా ఎందుకు తీసుకువ‌చ్చారు?  ఆ స‌మ‌యంలో క‌నీసం నిందితుల త‌ర‌ఫు లాయ‌ర్లు కానీ, ప్ర‌భుత్వం త‌ర‌ఫు లాయ‌ర్లు కానీ ఎందుకు అక్క‌డ లేరు? అనే ప్ర‌శ్న‌ల‌కు చ‌ట్టాన్ని ర‌క్షించాల్సిన పోలీసు ల వ‌ద్ద స‌మాధానం లేదు. ఎందుకంటే.. చ‌ట్టం.. త‌న ప‌ని తాను చేయ‌నీయ‌లేదు క‌నుక‌!! ఇక‌, త‌మిళ‌నా డులో తండ్రీ కొడుకుల క‌స్ట‌డీ డెత్ విష‌యాన్ని తీసుకుందాం. అత్యంత నిమ్న సామాజిక వ‌ర్గానికి చెందిన జ‌య‌రాజ్‌, బెన్నిక్స్‌ల‌ను లాక్‌డౌన్ స‌మ‌యం మించిపోయినా.. ప‌నులు చేస్తున్నార‌నే కార‌ణంగా స్టేష‌న్‌కు తీసుకువెళ్లిన పోలీసులు... వారిని చంపేసే వ‌ర‌కు నిద్ర‌పోలేదు!! 


ఇక్క‌డ వాస్త‌వానికి జ‌ర‌గాల్సింది ఏంటి?  లాక్‌డౌన్ స‌మ‌యం మించిపోయినా.. ప‌నులు చేస్తున్నా.. రోడ్ల‌పై తిరుగుతున్నా..కొవిడ్‌- చ‌ట్టం ప్ర‌కారం పోలీసులు చేయాల్సింది.. హెచ్చ‌రించి పంప‌డం, లేదా నాలుగు దెబ్బ‌లు వేయ‌డం, లేదా ఫైన్లు వేయ‌డం. కానీ, ఇక్క‌డ కూడా చ‌ట్టం.. త‌న ప‌నితాను చేసుకునే స్వేచ్ఛ‌ను ఇవ్వ‌లేక పోయాం!! ఇక‌, తాజా ఘ‌ట‌న‌.. పేరెన్నిక‌గ‌న్న‌.. బీజేపీ పాలిత ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన వికాస్ దూబే ఎన్‌కౌంట‌ర్ విష యానికి వ‌ద్దాం. దాదాపు 60 కేసులున్న వికాస్ దూబే.. అనేక ఘోరాలు, నేరాలు చేసిన మాట ‌వాస్త‌వం. ఇటీవ‌లే ఓ డీఎస్పీ స‌హా 8 మందిని అత్యంత పాశ‌వికంగా ఆయ‌న కాల్చి చంపించాడు. త‌న‌ను తాను ర‌క్షించుకునేందుకు అనేక మందిని పొట్ట‌న‌పెట్టుకున్నాడు. 

 

అయితే, చ‌ట్ట ప్ర‌కారం ఆయ‌న‌ను ఏం చేయాలి? ప‌ట్టుకుని న్యాయ‌స్థానానికి అప్ప‌గించి.. గ‌ట్టి శిక్ష ప‌డేలా చేయాలి. అదేస‌మ‌యంలో వికాస్ దూబే ఒక్క‌డు కాదు.. ఆయ‌నో వ్య‌వ‌స్థ‌.. అంటూ వ‌స్తున్న విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో ఆయ‌న వెనుక ఉన్న పెద్ద‌ల పాత్ర‌ను కూడా `చ‌ట్ట` ప్ర‌కారం బ‌య‌ట పెట్టాలి. నిజానికి చ‌ట్టం త‌న ప‌నితాను చేసి ఉంటే.. ఇలానే జ‌రిగి ఉండేది. కానీ, చ‌ట్టం త‌న ప‌నితాను చేయ‌నీయ‌లేదు! అందుకే వికాస్‌దూబేను కాన్పూర్‌కి తరలిస్తుండగా కారు బోల్తా పడింది..(అదేం చిత్ర‌మో.. ఎక్క‌డైనా కార్లు బోల్తా ప‌డితే.. రోడ్డు దెబ్బ‌లైనా త‌గులుతాయి.. కానీ ఈ ఘ‌ట‌న‌లో క‌నీసం కారుకున్న పేయింట్ కూడా చెక్కు చెద‌ర‌లేదు) అనంతరం అతడు ఓ గన్ లాక్కుని పారిపోయేందుకు ప్రయత్నించాడు(ఓ క‌ర‌డు గ‌ట్టిన నేర‌స్తుడు.. 8 మంది పోలీసుల‌ను చంపేసిన హంత‌కుడిపై పోలీసుల‌కు ఎంత ప్రేమ‌.. ఎంత స్వేచ్ఛ‌గా వ‌దిలేశారు!).. ఈ క్ర‌మంలోనే పోలీసులు ఎన్‌కౌంట‌ర్ చేశారు!! 


ఇదీ.. ఇప్పుడు యూపీ పోలీసులు చెబుతున్న మాట‌! కానీ, అదే చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకునేలా స్వే చ్ఛ క‌ల్పించి ఉంటే.. వికాస్ దూబెల వెనుక ఉన్న అనేక మంది వికాస్ లు చ‌ట్టానికి చిక్కేవారు!  అదేవిధంగా తెలంగాణ ఘ‌ట‌న‌లో ఆ వెట‌ర్న‌రీ డాక్టర్ మార‌ణ‌కాండ వెనుక‌ ఎవ‌రి నిర్లక్ష్య‌మో.. ఎవ‌రి పాప‌మో కూడా చ‌ట్ట ప్ర‌కారం తేలి ఉండేది!! కానీ, మ‌నం చ‌ట్టాన్ని రాసుకుని.. పేప‌ర్ల‌కు బంధీని చేశాం.. దాని ప‌నిని దానిని చేసుకునే అవ‌కాశ‌మే ఇవ్వ‌డం లేదు! అందుకే.. నేరానికి ఉన్న స్వేచ్ఛ‌.. చ‌ట్టానికి  లేకుండా పోతోంది!! అతి పెద్ద ప్ర‌జాస్వామ్య దేశంలో ఇలా మాట్లాడుకోవ‌డం కూడా నేర‌మే!! అందుకే ప్ర‌జాస్వామ్య వాదులు చెవిలోనే చిన్న‌మాట‌గా చెప్పుకొంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: