ఏపీ రాజధాని అమరావతి విషయం ప్రస్తుతానికి ఒక `కొలిక్కి` వచ్చింది. నిన్న మొన్నటి వరకు ఏం జరుగుతుందా? అని తీవ్ర ఉత్కంఠగా ఎదురు చూసిన ఈ విషయంపై.. ఏపీ జనాలకు కష్టమో.. ఇష్టమో.. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తేల్చేశారు. మూడు రాజధానులతో కూడిన పాలన వికేంద్రీకరణ బిల్లుపై ఆయన సంతకం చేశారు. దీంతో ప్రస్తుతానికి జగన్ ప్రభుత్వం విజయం సాధించిందనే వ్యాఖ్యలను ఒప్పుకోవాల్సిందే. అయితే, ప్రస్తుత పరిణామాల వెనుక జరిగిన కొన్ని విషయాలను పరిశీలిస్తే.. ఒక రాజధాని కోసం కొందరు రైతులు చేసిన త్యాగాలు.. అదేసమయంలో రాజకీయంగా వివిధ పార్టీలకు, ఆయా పార్టీల నాయకులకు మిగిలిన గాయాలు ప్రస్థావనకు రాకుండా ఉండవు.
నిజానికి అమరావతికి భూములు ఇచ్చిన రైతులు చేసింది త్యాగమే! ఈ విషయంలో సందేహాలు అవసరం లేదు. వైఎస్సార్ సీపీ నేతలు గతంలో ఒకింత విమర్శలు చేసినా.. తర్వాత సర్దుకున్న విషయం పరిగణించాల్సిన అంశం. అయితే, ఈ త్యాగాల వెనుక రాజకీయాలు కూడా ఉన్నాయనే విషయాన్ని మాత్రం లెక్కలోకి తీసుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో రాజకీయ నేతలు ముఖ్యంగా టీడీపీ నాయకులు రాజధాని ఈ ప్రాంతంలో వస్తోందని తెలిసి.. ముందుగానే భూములు కొనుగోలు చేశారు. రైతులకు పావలా చొప్పున కట్టబెట్టి.. తర్వాత.. అవేభూములను అప్పటి చంద్రబాబు ప్రభుత్వానికి ల్యాండ్ పూలింగ్‌లో ఇచ్చి కోట్లు కూడబెట్టిన వారు ఉన్నారు. ఇక, మరికొందరు నాయకులు ప్రధాన ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉండేలా కొన్ని భూములను లోపాయికారీగా కొనుగోలు చేశారు.
వీటిని కూడా త్యాగాలుగానే ప్రొజెక్టు చేసి.. నిన్న మొన్నటి వరకు టీడీపీ పెద్ద ఎత్తున పోరు చేసింది. అయితే, వాస్తవం దాగేది కాదు కనుక.. ఎవరివి త్యాగాలో గుర్తించిన జగన్ ప్రభుత్వం.. వారికి న్యాయం చేస్తామని చెప్పింది. రాజధానిగా పూర్తిస్థాయిలో అమరావతి ఉండబోదని తేల్చి చెప్పింది. ఇక, ఈ నిర్ణయంతో అమరావతి ప్రాంతంలో అప్పటివరకు ఉన్న రియల్ ఎస్టేట్ బిజినెస్ కావొచ్చు మరేదైనా కావొచ్చు.. పూర్తిగా దెబ్బతిన్నాయి. దీనివల్ల అప్పటికే భూములను ప్రభుత్వానికి ఇచ్చిన రైతులకు జరిగే నష్టం ఏమీ ఉండదు. కేవలం రాజధానిని అడ్డు పెట్టుకుని వ్యాపారాలు చేయాలనుకునే బడాబాబులకే దెబ్బయిపోయింది తప్ప! కానీ, ఈ విషయంలో త్యాగాల గాయం రైతులకే తగిలింది.
ఏకంగా జోలెపట్టి అమరావతి ఉద్యమం కోసం రూకలు పోగేస్తున్నానని చెప్పిన చంద్రబాబు హఠాత్తుగా పక్కకు తప్పుకొన్నారు. అయితే, ఆయన కనుసన్నల్లోనే ఉద్యమం సాగింది. దీనికి కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులు, లేదా ఎస్సీ వర్గానికి రైతులు మాత్రమే మద్దతు తెలపడం గమనార్హం. ఇక, ఇప్పుడు మొత్తంగా గవర్నర్ హరిచందన్ నిర్ణయంతో ప్రభుత్వం పాలనా రాజధానిని విశాఖకు తరలించే ప్రయత్నాలు ముమ్మరం చేయొచ్చు. కానీ, ప్రస్తుతం ఈ రాజధానికి సంబంధించిన కేసులు కోర్టుల్లో ఉన్నాయి. రేపు వీటిపై విచారణ జరిగి.. రైతులకు అనుకూలంగా తీర్పువస్తే.. అప్పుడు జగన్ సర్కారుకు గాయాలు కాకుండా ఉండవు!! ఇలా మొత్తంగా ఒక రాజధాని విషయమే అయినప్పటికీ.. అటు త్యాగాలు చేసిన వారికి, ఇటు రాజకీయ వ్యూహాలతో ముందుకు సాగుతున్న వారికి కూడా గాయాలు చేస్తోందనడంలో సందేహం లేదు!!