ఇది సోషల్ మీడియా యుగం అని మనందరకీ తెలిసిందే. దీంతో టైం పాస్ చేసే రోజులు దాటి వాటితోనే చాలా మంది డబ్బులు సంపాదిస్తూ జీవనం సాగిస్తున్నారు. అందులో యూ ట్యూబ్ ది మరో ప్రత్యేక పాత్ర. యూట్యూబ్ లో కంటెంట్ క్రియేటర్స్ గా లక్షలు లక్షలు సంపాదిస్తున్న వారు సైతం ఉన్నారు. అలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని.. చాలా మంది తమకు తెలిసిన పనినే కొంత సృజనాత్మకత జోడించి యూట్యూబ్ వీడియోలు తీస్తున్నారు.


ఇంత వరకు బాగానే ఉన్నా.. కానీ కొందరు మాత్రం వీడియోల కోసం చెత్త పనులు చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారు. వ్యూస్ కోసం అడ్డమైన వీడియోలు పెడుతూ జనాలతో ఆటలాడుకుంటున్నారు. ఏవేవో వీడియోలు తీసి వీటికి థంబ్ లైన్స్ యాడ్ చేసి వ్యూస్ పెంచుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఇలాంటి మోసాలే ఎక్కువగా జరుగుతున్నాయి.


గతంలో ఇళ్లు అద్దెకు కావాలన్నా..కొనాలన్నా, ప్లాట్లు కొందామన్నా.. లేక ఇతర రియల్ ఎస్టేట్ వెంచర్ల కోసం పేపర్ ప్రకటనలపై ఆధారపడేవాళ్లం. ఇలా ఇచ్చే వారిలో విశ్వసనీయత ఉంటేనే ఆయా పత్రికలు ఆ ప్రకటనలను ప్రచురించేవి. ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. యూ ట్యూబ్ ఓపెన్ చూస్తే చాలు. తక్కువ ధరలో ఇల్లు కావాలా .. ఈ ప్రాంతంలో అద్దె ఇంటి కోసం వెతుకుతున్నారా.. ఆకర్షణీయమైన ధరలో రియల్ ఎస్టేట్ వెంచర్లు అంటూ రకరకాల వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి.


తీరా వీటిని చూసి అక్కడికి పోయి చూస్తే అక్కడ ఇల్లు ఉండదు. ప్లాట్ ఉండదు. వీడియోల కోసం తప్పుడు సమాచారం పెడుతూ వీక్షకులను పక్కదారి పట్టిస్తుంటారు. మరికొంత మందీ ఆ ప్రాంతాలను, పరిసరాలను, ప్లాట్లను చూపుతారు. కానీ ఎవర్నీ సంప్రదించాలో చూపించరు. వీక్షకులు ఉత్సాహంతో ఆ వీడియోలను చూస్తారు. కానీ వారికి నిరాశే ఎదురవుతుంది. దీంతో వారికి వ్యూస్ పెరుగుతాయి. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: