కరోనా లాంటి విపత్కర సమయంలోను అనేక ఆర్థిక కష్టనష్టాలను ఎదురొడ్డి ఏ ఒక్క హామీని విస్మరించలేదని పదే పదే చెప్పారు. అధికారం చేపట్టిన దగ్గర నుంచి ఇచ్చిన నవరత్నాలను అమలు చేశామని చెప్పారు. నగదు బదిలీ పథకం ద్వారా లక్షల రూపాయలను లబ్ధిదారుల ఖాతాలకు జమ చేశారు. ఎలాంటి పైరవీలు లేకుండా రూపాయి తగ్గకుండా ప్రజలకు డబ్బులను పంచి పెట్టారు.
దీంతో పాటు పాత పంచాయతీ రాజ్ వ్యవస్థను పక్కన పెట్టి కొత్తగా వార్డు, సచివాలయ, వాలంటీర్ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చారు. ప్రజల వద్దకే పాలన అనే అంశాన్ని తీసుకురాగలిగారు. ఈ వాలంటీర్, సచివాలయ వ్యవస్థను అమలు చేసేందుకు పలు రాష్ట్రాలు ముందుకు వచ్చాయి. మరోసారి జగన్ అధికారంలోకి వస్తే దేశానికి రోల్ మోడల్ అయ్యేవారేమో. కానీ ప్రజలు కేవలం సంక్షేమ పథకాలను మాత్రమే చూడలేదు.
చంద్రబాబు అభివృద్ధి చేసి సంక్షేమ పథకాలను, ఇచ్చిన హామీలను విస్మరించారు అని 2019లో దూరం పెట్టారు. జగన్ సంక్షేమ పథకాలు అమలు చేసినా అభివృద్ధి చేయలేదని అధికారం ఇవ్వలేదు. దీంతో ప్రజలు సంక్షేమ పథకాలు చూసే ఓట్లు వేయరు అనే భావనకు రాజకీయ పార్టీలు వచ్చేశాయి. దీంతో దేశంలోని కర్ణాటక, తెలంగాణ, మధ్య ప్రదేశ్, యూపీలతో పాటు పలు రాష్ట్రాలు సంక్షేమ పథకాల అమల్లో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. పైపైన వాటిని అమలు పరుస్తూ చేతులు దులుపుకొంటున్నాయి. ఇది వైసీపీ ఓటమి కారణంగా వచ్చిన మార్పని పలువురు పేర్కొంటున్నారు.