ప్రతి ఎన్నికల తర్వాత మార్పును ఆశిస్తామని.. పేద, ధనిక వర్గాల మధ్య అంతరాలు పెంచడం వంటివి జరిగేవే అని.. అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయని అన్నారు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట పడాల్సిన అవసరం ఉందన్నారు. లౌకిక దేశమైన భారత్ లో రాజకీయాలు ఎప్పుడూ పారదర్శకంగా ఉండాలని చెప్పారు. హిందూ దేశంగా మార్చాలనే భావన సరికాదని చెప్పారు.
అయోధ్యలో రామ మందిరం నిర్మించిన యూపీలోని ఫైజాబాద్ లో బీజేపీ ఓటమిపై స్పందిస్తూ.. భారతదేశానికి నిజమైన గుర్తింపు కప్పి పుచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. మహాత్మా గాంధీ, రవీంద్ర నాథ్ ఠాగూర్, నేతాజీ పుట్టిన దేశంలో ఎంతో ధనం వెచ్చించి రామాలయం నిర్మించి భారతదేశాన్ని హిందూ దేశంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగి ఉండాల్సింది కాదన్నారు.
ఇండియాలో నిరుద్యోగం పెరిగిందని.. ప్రాథమిక విద్య, ప్రాథమిక ఆరోగ్య సేవలు వంటి రంగాలను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. కేంద్రంలో కొత్తగా ఏర్పడిన క్యాబినెట్ పాత మంత్రి మండలి నకలేనని వ్యాఖ్యానించారు. మంత్రులు అవే శాఖల్లో కొనసాగుతున్నారని.. కొద్ది పాటి మార్పులు మినహా రాజకీయంగా శక్తివంతులైన వారు ఇప్పటికీ అలానే కొనసాగుతున్నారని అని వివరించారు. అప్పుడు బ్రిటీష్ పాలనలో ఎలాంటి విచారణ జరపకుండానే ప్రజలను కారాగారాల్లో బంధించేవారని.. నేను యువకుడిగా ఉన్నప్పుడు నా బంధువులు అనేక మంది ఎలాంటి విచారణ ఎదుర్కోకుండానే జైలుకి వెళ్లారు. స్వేచ్చా వాయువులు పీల్చుకున్న దేశంలో ఇలా జరగకూడదని మేము ఆశించాం. కానీ ప్రస్తుత పాలనలో ఇది మరింత పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.