కేసీఆర్ గవర్నమెంట్ లో అందలం అందుకొని.. సీఎం కార్యాలయంలో హవా నడిపించిన ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ కి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పెద్దగా ప్రాధాన్యం లేదు. గతంలో మాదిరిగా ఆహా, ఓహో అంటూ భజన చేసేవారు లేరు. అందుకేనేమో ఉనికి చాటుకోవడానికి అన్నట్లు స్మితా సబర్వాల్ ఎక్స్ వేదికగా కామెంట్లు చేశారు.


సివిల్ సర్వీసుల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరం లేదని, వాటిని రద్దు చేయాలని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. దివ్యాంగులకు గౌరవం ఇవ్వాల్సిందేనంటూ.. అత్యంత కీలకమైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ పోస్టులకు రిజర్వేషన్లు ఎందుకని ప్రశ్నించారు. జస్ట్ ఆస్కింగ్ అంటూ పోస్టు చేశారు. దివ్యాంగులకు ఎయిర్ లైన్ సంస్థ పైలెట్ గా ఉద్యోగం ఇస్తుందా? దివ్యాంగుడైన డాక్టర్ ని మీరు విశ్వసిస్తారా అంటూ పోస్టు పెట్టారు.


ఆల్ ఇండియా సర్వీసెస్ ఉద్యోగులు ఎక్కువగా ఫీల్డ్ లో ఉండాల్సి వస్తుందని, ఎక్కువ గంటలు పనిచేయాల్పి ఉంటుందని.. ఆల్ ఇండియా సర్వీసెస్ ఉద్యోగాలకు ఫిజికల్ ఫిట్ నెస్ ముఖ్యమన్నారు స్మితా సబర్వాల్. కాగా దీనిపై సోషల్ మీడియా వేదికగా పెద్ద దుమారమే రేగుతోంది. అయితే దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నా.. చాలా మంది తప్పుపడుతున్నారు. రిజర్వేషన్లు అనేది ప్రభుత్వ విధానమని.. ఇలాంటి సున్నిత మైన అంశాల్లో కామెంట్లు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.


వాస్తవానికి ఫిజికల్ ఫిట్ నెస్ కన్నా.. మెంటల్ ఫిట్ నెస్ అత్యంత ముఖ్యమని చెబుతున్నారు. ఈమె కామెంట్లతో సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న చాలా మంది యువత తమ మానసిక ధైర్యం దెబ్బతింటుందని అన్నారు. చాలా మందిని దాటుకొని ఈ స్థాయికి వచ్చామని.. దివ్యాంగులకు మరీ అంత తక్కువ రిజర్వేషన్లు కూడా ఏమీ లేవని గుర్తు చేస్తున్నారు. ఇంతకీ ఈమెకు స్టీఫెన్ హాకింగ్స్ తెలుసా అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యల కారణంగా
దివ్యాంగుల పట్ల సమాజంలో చిన్నచూపు ఏర్పడే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ఆమెపై వెంటనే దివ్యాంగులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: