జాతీయ రహదారులపై ప్రయాణించేవారు బడలిక తీర్చుకునేందుకు కాసేపు సేద తీరాల్సి వస్తోంది. భోజనం, టిఫిన్లు చేసేందుకు రెస్టారెంట్లు వద్ద ఆగాల్సి వస్తోంది. ఎలక్ర్టిక్ వాహనాల్లో ప్రయాణించే వారు తమ వాహనాలకు ఛార్జింగ్ చేసుకునేందుకు వేచి ఉండక తప్పదు. ఇలాంటి సమాయాల్లో రాత్రి వేళ డ్రైవర్లకు నిద్ర వస్తే ఓ కునుకు తీసేందుకు సురక్షిత మైన ప్రదేశం ఏదన్నది ప్రశ్నార్థకంగా మారుతోంది.


ఈ అవసరాలను తీర్చేందుకు వేర్వేరు ప్రదేశాల్లో కాకుండా ఒక చోట అందుబాటులో ఉంటే ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా.. సురక్షితంగా ఉంటుంది. అందుకోసమే వై సైడ్ ఎమినిటిస్ లను నిర్మించాలని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ నిర్ణయించింది. దేశంలో తొలిసారిగా వే సైడ్ ఎమినిటీస్ ను నిర్మించే ప్రణాళికకు ఎన్‌హెచ్‌చ్ఏఐ ఆమోదించింది.


దేశంలో హైవేల వెంబడి రెస్టారెంట్లు, రెస్ట్ హౌస్ ల తరహాలో నిర్మించే వే సైడ్ ఎమినిటీస్ లో ప్రయాణికులు సేద తీరేందుకు అన్ని వసతులు ఒక చోట ఉండేలా చూస్తారు. ఇప్పటి వరకు హైవేల నిర్మాణంతో పాటు  ఎంపిక చేసిన ప్రదేశాల్లో వాహనాలు నిలిపేందుకు ప్రత్యేకంగా పార్కింగ్ బేలను నిర్మిస్తున్నారు. ఆ ప్రదేశంలో లారీలు, ఇతర వాహనాలను నిలిపేందుకు మాత్రమే అవకాశం ఉంది.


కానీ.. డ్రైవర్లు, ప్రయాణికులకు విశ్రాంతి, భోజనం, ఆహ్లాదం, నిద్రించేందుకు ఎటువంటి వసతులు ఉండటం లేదు. భోజనం, టిఫిన్లు చేసేందుకు ఎక్కువగా ప్రైవేట్ గా దాబాల వద్ద వాహనాలను నిలుపుతున్నారు. కానీ విశ్రాంతి తీసుకునేందుకు సరైన సౌకర్యాలు లేవు. దీంతో అలసిపోయినా తప్పని సరి పరిస్థితుల్లో వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు.


దీనికి పరిష్కారంగా అన్ని వసతులతో కూడిన వే సైడ్ ఎమినిటీస్ ను నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. వాటలో రెస్టారెంట్లు, డార్మిటెరీలు, పిల్లల ఆట స్థలాలు, పెట్రోల్ బంకులు, ఈవీ ఛార్జింగ్ మిషన్లు, ఏటీఎంలు వంటి అన్ని వసతులను అందుబాటులోకి తీసుకువస్తారు.  దేశ వ్యాప్తంగా ప్రతి 50 కి.మీ.కి ఒక వే సైడ్ ఎమినిటీస్ ను నిర్మించాలని ఎన్ హెచ్ఏఐ నిర్ణయించింది. తొలి దశలో దేశంలో ఒక్కో దానికి రూ.10 కోట్ల చొప్పున మొత్తం 1000 చోట్ల వీటి నిర్మాణానికి ఆమోదం తెలిపింది. రానున్న మూడేళ్లలో ఇవి అందుబాటులోకి రానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: