ప్రజల సమస్యలను చర్చించి .. పరిష్కారానికి మార్గాలు కనుక్కోవడం, ప్రజలకు నష్టం చేసే నిర్ణయాలు ఉపసంహరించుకొని.. రాష్ట్రం, దేశానికి ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలను తీసుకునే వేదికలు చట్టసభలు. ప్రజలు రాజకీయ నాయకులను ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎన్నుకొని వారిని తమ ప్రతినిధులుగా చట్టసభలకు పంపిస్తారు. ప్రజలకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించేలా ఎమ్మెల్యేలు కృషి చేయాలి.


ఇదే సందర్భంలో తమ ఎమ్మెల్యే ఏం మాట్లాడుతున్నారు. మా ప్రాంత సమస్యలపై ప్రస్తావిస్తున్నారా అని ఆ నియోజకవర్గ ప్రజలు వాటి గురించి ఆసక్తిగా చూస్తుంటారు. అయితే ఏపీలో భిన్న వాతావరణం కనిపిస్తోంది. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం అయ్యాయి. మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. రెండో రోజు, మూడో రోజు అసెంబ్లీలో రెండు కీలక బిల్లులపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరూ కూడా  కనిపించలేదు.


ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ.. దిల్లీలో ధర్నాకు మాజీ సీఎం జగన్ వారిని వెంటబెట్టుకొని వెళ్లారు. ఒకవేళ ఏదైనా సమస్యలు ఉంటే.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనుకుంటే అసెంబ్లీని సైతం వేదికగా చేసుకోవచ్చు. సమావేశాలకు హాజరై ఏదైనా అంశంపై తాము నిరసన తెలియజేస్తున్నామని చెప్పి వాకౌట్ చేయొచ్చు. ఇదంతా సభ రికార్డుల్లో నమోదు అవుతుంది.  లేదా ప్రశ్నోత్తరాల సమయంలో సంబంధిత శాఖ మంత్రులను అడగొచ్చు. కానీ వాటిని వినియోగించకుండా జగన్ చారిత్రక తప్పు చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


పైగా అసెంబ్లీకి వెళ్లకపోతే జగన్ కే ప్రతికూలాంశంగా మారతుందని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే అంతకు ముందు మూడు సార్లు సీఎంగా వ్యవహరించిన చంద్రబాబు జగన్ ముందు ప్రతి పక్ష నేతగా కూర్చొన్నారు. అసెంబ్లీలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. బిల్లుల సందర్భంగా కీలక సూచనలు చేశారు. అవమానించినా.. మైక్ కట్ చేసినా సభలోనే ఉన్నారు. దీనిని ప్రజలంతా చూశారు. దీంతో ఆయనపై ప్రజల్లో సానుభూతి పెరిగింది. ఇప్పుడు జగన్ కూడా అసెంబ్లీకి వస్తే బాగుంటుందని.. లేకపోతే అధికారంలో ఉంటేనే అసెంబ్లీకి వెళ్తారా అనే భావన ప్రజల్లో ఏర్పడుతుందని పలువురు హెచ్చరిస్తున్నారు. ఇది అంతిమంగా జగన్ కు కీడు చేస్తుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: